విమానాశ్రయ సమీపాన వైసీపీ రాజభవనం
ABN , Publish Date - Jun 24 , 2024 | 01:22 AM
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన వైసీపీకి చెందిన రాజభవనం వెలిసింది. ఏడాదిన్నర కిందట అధికారాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజు ధరపై దక్కించుకున్న వైసీపీ పెద్దలు అందులో ఎలాంటి అనుమతులూ లేకుండా జిల్లా పార్టీ కార్యాలయం పేరిట భారీ భవంతిని నిర్మించారు.

- నామమాత్రపు లీజు ధరతో ఖరీదైన
భూమి కేటాయించిన గత ప్రభుత్వం
- పరిశ్రమలకు ఇవ్వాల్సిన
భూమి రాజకీయ పార్టీకి
- పంచాయతీ, తుడ అనుమతులు
లేకుండానే నిర్మాణం
తిరుపతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన వైసీపీకి చెందిన రాజభవనం వెలిసింది. ఏడాదిన్నర కిందట అధికారాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజు ధరపై దక్కించుకున్న వైసీపీ పెద్దలు అందులో ఎలాంటి అనుమతులూ లేకుండా జిల్లా పార్టీ కార్యాలయం పేరిట భారీ భవంతిని నిర్మించారు. ఒకవైపు విమానాశ్రయం, మరోవైపు ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమల నడుమ విలువైన భూమిని ఓ రాజకీయ పార్టీకి కేటాయించడమే ఆశ్చర్యకరమైతే దానికి స్థానిక పంచాయతీ నుంచి గానీ, తుడ నుంచి గానీ అనుమతులు లేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు చేసిన భూ కేటాయింపులు, భవనాల నిర్మాణంపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.
ఎలకా్ట్రనిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో
ఖరీదైన భూమి కేటాయింపు
రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ కుర్రకాల్వ రెవెన్యూ గ్రామం 219-15, 219-16 సర్వే నెంబర్లలోని రెండెకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్లపాటు వైసీపీ కార్యాలయం కోసం లీజుకు కేటాయిస్తూ 2022 డిసెంబరు 20న అప్పటి ప్రభుత్వం జీవో (నెంబరు 757) జారీ చేసింది. ఎకరాకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున లీజు చెల్లించే ప్రాతిపదికన భూమి కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ భూమి విమానాశ్రయానికి చేరువగా ఆ మార్గంలోనే వుంది. గత టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఇక్కడే ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా శ్రీవెంకటేశ్వర ఎలకా్ట్రనిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లస్టర్ పరిధిలో ఇప్పటికే కార్బన్ మొబైల్స్, సెల్‌కాన్ మొబైల్స్ వంటి ఎలకా్ట్రనిక్స్ వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలినరీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలున్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములను ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలు లేదా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు కేటాయించేందుకు ఉద్దేశించారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం విలువ రూ.5కోట్లకుపైగా పలుకుతోంది. ఇలాంటి చోట ఓ రాజకీయ పార్టీకి రూ.10 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని ఎకరాకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి నామమాత్రపు చెల్లింపుతో లీజుపై కేటాయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పంచాయతీ ఇచ్చింది నిరభ్యంతర పత్రమే!
వైసీపీ కార్యాలయం కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని జీపాలెం పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. భూమి కేటాయింపు ప్రక్రియలో భాగంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ పాలకవర్గంతో ఆ మేరకు తీర్మానం చేయించారు.
అనుమతులు లేకుండానే నిర్మాణం
వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి స్థానిక జీపాలెం పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. నిర్మాణం ప్రారంభించిన సమయంలో పంచాయతీ సిబ్బంది వెళ్లి వాకబు చేయగా కలెక్టర్ అనుమతి, తుడ అనుమతులు వున్నాయని పనులు చేపట్టిన వ్యక్తులు చెప్పినట్టు సమాచారం. అసలే అధికార పార్టీ కార్యాలయం వ్యవహారం కావడంతో పంచాయతీ సిబ్బంది మిన్నకుండిపోయారని తెలిసింది. కాగా తుడాలో ఆరా తీయగా వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని, తుడా అనుమతులు ఇవ్వలేదని వెల్లడైంది. భవన నిర్మాణం చేపట్టిన స్థలం పారిశ్రామికవాడ పరిధిలో వున్నందున ఏపీఐఐసీ అధికారుల నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారేమోనని ఆరా తీయగా అలాంటిదేమీ లేదని తెలిసింది.
ప్రభుత్వాదాయానికి భారీగా గండి
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా రూ. 10 కోట్లు విలువైన భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. మరోవైపు స్థానిక పంచాయతీ, తుడ నుంచీ అనుమతులు లేకపోవడంతో ఆ రెండు స్థానిక సంస్థలు కూడా భారీగానే ఆదాయం కోల్పోయాయి. ప్లాన్ అప్రూవల్ సందర్భంగా ఎంత విస్తీర్ణంలో, ఎన్ని అంతస్తులతో భవనం నిర్మిస్తున్నారనే దాన్ని బట్టి పంచాయతీకి అప్రూవల్, డెవల్‌పమెంటల్ చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. అవన్నీ పంచాయతీ కోల్పోయినట్టయింది.
కూలుస్తారా? క్రమబద్ధీకరిస్తారా?
భూమి ఏదైనా, భవనం ఎలాంటిదైనా పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపడితే తప్పనిసరిగా పంచాయతీ నుంచి అనుమతులు పొందాలి. ఎందుకంటే ఆ భవనానికి పంచాయతీయే డోర్ నెంబరు, అసె్‌సమెంట్ నెంబరు కేటాయించాల్సి వుంటుంది. ఆస్తి పన్ను వంటివి నిర్ణయించేది కూడా పంచాయతీయే. మరోవైపు తుడ నుంచి గానీ, ఏపీఐఐసీ నుంచి గానీ అనుమతులు లేవు. ఇవేవీ జరగనపుడు ఆ భవనాన్ని అక్రమ కట్టడంగా పరిగణించాల్సి వుంటుంది. ఈ లెక్కన వైసీపీ కార్యాలయ భవనాన్నీ అక్రమ కట్టడంగానే భావించాలి. ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల ఇళ్లను సైతం నిబంధనల ఉల్లంఘన నెపంతో కూల్చివేయించిన వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయానికి మాత్రం ఎలాంటి అనుమతులూ పొందకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. అనుమతులు లేకపోవడంపై నోటీసులు జారీ చేసి.. క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటుందా? లేకపోతే అక్రమ కట్టడం కింద పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేస్తుందా? అన్నది వేచి చూడాల్సి వుంది.