Share News

Paris Olympics 2024: యువ షూటర్ మనుభాకర్‌కు ఏపీ నుంచి ప్రశంసల వెల్లువ..

ABN , Publish Date - Jul 28 , 2024 | 08:04 PM

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌‌కు తొలి పతకాన్ని అందించిన యువ షూటర్‌ మనుభాకర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఒలింపిక్స్‌ షూటింగ్‌ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సైతం ఆమె రికార్డు సృష్టించడంతో పెద్దఎత్తున అభినందనలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దేశం గర్వించదగ్గ పని చేశావంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

పారిస్ ఒలంపిక్స్ 2024లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పతకం అందించిన యువ షూటర్ మనుభాకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఒలంపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ తరఫున పతకం గెలిచిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించడంపైనా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలంటూ ఆకాంక్షించారు.

మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేశ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సైతం ఎక్స్ వేదికగా మనుభాకర్‌కు అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో ఆమె దేశానికి పతకాన్ని అందించారని కొనియాడారు. ఆమె ప్రేరణతో ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రులు ఆకాంక్షించారు. ఒలంపిక్స్ క్రీడల్లో భారతదేశాన్ని పతకాల పట్టికలో చేర్చి గొప్ప శుభారంభం ఇచ్చారంటూ ఆమెకు కితాబు ఇచ్చారు. షూటింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని ఆమె అందించడం గర్వకారణంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మనుభాకర్ స్ఫూర్తితో మరిన్ని పతకాలను దేశ ఖాతాలో వేయాలని క్రీడాకారులకు మంత్రులు పిలుపునిచ్చారు.

మనుభాకర్ విజయాన్ని ఏపీ క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. అసాధారణ నైపుణ్యం, అంకితభావం ప్రదర్శించారని అభినందించారు. ఆమె విజయం మన దేశ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచి మరిన్ని పతకాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని ఎక్స్‌లో మంత్రి రాసుకొచ్చారు. తన విజయం తన వ్యక్తిగత నైపుణ్యానికి గుర్తింపు మాత్రమే కాదని, ఆమెకు అండగా నిలిచిన కోచ్‌లు, సహాయక సిబ్బంది, కుటుంబసభ్యుల సమష్టి కృషికి నిదర్శనం అన్నారు. దేశానికి, క్రీడా ప్రపంచానికి ఆమె చేసిన కృషి మరవలేనిదని, మరిన్ని పతకాల సాధించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా యువ షూటర్ మనుభాకర్ చరిత్ర సృష్టించారు.10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్‌కు ఆమె తొలి పథకాన్ని అందించారు. 221.7 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచి దేశానికి కీర్తి తెచ్చారు. ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సైతం ఆమె చరిత్ర లిఖించారు.

Updated Date - Jul 28 , 2024 | 08:04 PM