Share News

మన్మోహన్‌ మృతి దేశానికి తీరనిలోటు

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:42 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.

మన్మోహన్‌ మృతి దేశానికి తీరనిలోటు

మన్మోహన్‌ జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయక పాఠం!.. వీడియో సందేశంలో మోదీ

నేటి దేశాభివృద్ధి ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితమే: చంద్రబాబు

మన్మోహన్‌ ఓ చాంపియన్‌ ఘనంగా నివాళులర్పించిన అగ్రరాజ్యాధినేతలు

న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ నిర్మాణంలో మన్మోహన్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలోని మన్మోహన్‌ నివాసంలో శుక్రవారం ఆయన భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్‌సింగ్‌ సతీమణి గురుచరణ్‌ కౌర్‌ను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మన్మోహన్‌సింగ్‌ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశానికి దశ, దిశను నిర్దేశించారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. దేశంలో విదేశీమారక ద్రవ్యం లేని పరిస్థితుల్లో మన్మోహన్‌ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. భారత దేశం ఈ రోజు ప్రపంచంలోనే గొప్పగా మారుతోందంటే ఆనాడు మన్మోహన్‌ వేసిన పునాదులే కారణమని పేర్కొన్నారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్‌ ప్రధాని స్థాయికి ఎదిగారని కొనియాడారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు బైరెడ్డి శబరి, కేశినేని చిన్ని, సానా సతీశ్‌ తదితరులు మన్మోహన్‌కు నివాళుర్పించారు. బాపట్ల ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా మాజీ ప్రధాని భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కాగా, మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్‌సింగ్‌ భౌతికకాయానికి మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ నివాళులర్పించారు.


దేశ పురోగతికి ప్రేరణ

మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణల ఆద్యుడని, దేశ పురోగతికి ప్రేరణ కల్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్‌ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి అచ్చెన్నాయుడు సంతాప సందేశంలో తెలిపారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసినా, అతి సాధారణ జీవితాన్ని గడిపిన వ్యక్తి మన్మోహన్‌సింగ్‌ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచిపోతారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంకితభావం కలిగిన మన్మోహన్‌సింగ్‌ విజనరీ లీడర్‌ అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని మలుపుతిప్పిన మహనీయుడు మన్మోహన్‌సింగ్‌ అని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టపర్చడంలో మన్మోహన్‌సింగ్‌ తనదైన ముద్ర వేశారని మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్‌ దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ, గ్లోబల్‌ మార్కెట్‌లో భారత్‌ను ఆర్థిక శక్తిగా నిలిపారని మంత్రి కందుల దుర్గేష్‌ కొనియాడారు. మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత దేశానికి తీరని లోటని మంత్రి సవిత పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్‌ మరణంతో దేశం మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 1990 దశకంలో మన్మోహన్‌సింగ్‌ సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థని మలుపుతిప్పారని మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ పేర్కొన్నారు.


నిశ్శబ్ద శక్తి మన్మోహన్‌సింగ్‌

దూర దృష్టి, విశాల దృక్పథంతో భారత ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్‌సింగ్‌ నూతన దిశానిర్దేశం చేసిన నిశ్శబ్ద శక్తి. ఆయన మరణం బాధాకరం. చట్ట సభలో ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేటి యువ నాయకులు నేర్చుకోవాలి.

- స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు

దిగ్ర్భాంతికి గురయ్యా

దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన మన్మోహన్‌సింగ్‌ దివంగతులయ్యారన్న వార్త తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

- ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

మహానుభావుడు

దేశ ఆర్థిక విధానాల్లో మన్మోహన్‌సింగ్‌ ఆదర్శప్రాయమైన మార్పును తెచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈ దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించిన మహానుభావుడు.

- మంత్రి నారా లోకేశ్‌

Updated Date - Dec 28 , 2024 | 03:42 AM