Share News

Cyclone Fengal : హమ్మయ్య.. ముప్పు తప్పింది

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:49 AM

ఫెంగల్‌ తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

 Cyclone Fengal : హమ్మయ్య.. ముప్పు తప్పింది

  • రిడ్జ్‌ ప్రభావంతో తప్పిన పెను తుఫాను ప్రమాదం

  • నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో

  • భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

  • 4,463 హెక్టార్లలో పంటల మునక

  • పుత్తూరులో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం

  • తిరుమల ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు

  • కొండపై నిండుతున్న జలాశయాలు

  • నేడు, రేపు తేలికపాటి వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఫెంగల్‌ తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆదివారం రాత్రి తరువాత మరింత బలహీనపడి పశ్చిమ, వాయువ్యంగా పయనిస్తూ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం వరకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోస్తా, రాయలసీమల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుఫాన్‌ తీరం దాటడంతో అన్ని ఓడరేవుల్లో హెచ్చరికలను ఉపసంహరించారు.


Untitled-4 copy.jpg


  • ఆవర్తనంగా మొదలై 11 రోజులు..

సాధారణంగా తుఫాను తీరం దాటిన తరువాత క్రమేపీ భూ ఉపరితలంపై పయనించి బలహీనపడుతుంది. అయితే మయన్మార్‌ పరిసరాల్లో కొనసాగుతున్న రిడ్జ్‌ ప్రభావంతో ఫెంగల్‌ తుఫాన్‌ తీరందాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఆ రిడ్జ్‌ వల్లే ఉత్తర తమిళనాడు తీరానికి వచ్చిన తుఫాన్‌ పశ్చిమంగా దిశ మార్చుకుందన్నారు. గత నెల 21న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పలు దశల్లో బలపడి శనివారం రాత్రి తీరం దాటే వరకు మొత్తం 11 రోజులు కొనసాగిందని, ఇన్ని రోజులు సముద్రంలో కొనసాగడంతో పెనుతుఫాన్‌గా మారాల్సి ఉందని, అయితే, శ్రీలంక, తమిళనాడులో భూ ఉపరితలం నుంచి పొడిగాలులు వీయడంతో ఫెంగల్‌ తుఫాన్‌ బలపడలేదని విశ్లేషించారు. లేకుంటే ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేదని వివరించారు.

  • మూడు జిల్లాల్లో భారీ వర్షాలు..

తుఫాన్‌ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాచపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పోడులో 149.25, తడ మండలం భీములవారిపాలెంలో 137, చిటమూరు మండలం మల్లాంలో 134.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 133.5, దొరవారిసత్రం మండలం పూలతోటలో 124, నగరిలో 120.75, సూళ్లూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. రానున్న 48గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


  • 4,463 హెక్టార్లలో పంటల మునక

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తిరుపతి, చిత్తూరు, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రధానంగా వరి 4,171, వేరుశనగ 202, మినుము, పెసర, కంది, మొక్కజొన్న పంటలు 90 హెక్టార్లలో ముంపు బారిన పడగా, తిరుపతి జిల్లాలో 3,845 హెక్టార్లలో వరి నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నాలుగు జిల్లాల్లోని 42 మండలాల్లో 393 గ్రామాలు ప్రభావితమయ్యాయని, 4,663 మంది రైతుల కు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

  • తిరుమలను కప్పేసిన పొగమంచు

తిరుమలలో వరుసగా మూడవరోజైన ఆదివారం కూడా వర్షం కురిసింది. చలి కూడా బాగా పెరగడంతో చాలామంది భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుగు ప్రయాణమయ్యారు. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. రెండవ ఘాట్‌రోడ్డులో 14, 15 కిలోమీటర్ల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఫారెస్ట్‌, విజిలెన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు బండరాళ్లు, మట్టిని ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. తిరుమల ప్రెస్‌క్లబ్‌, ఆదిశేషు విశ్రాంతి భవనం వద్ద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాలకు తిరుమల కొండపై ఉన్న ఐదు డ్యామ్‌లు నిండుతున్నాయి.

Untitled-4 copy.jpg

Updated Date - Dec 02 , 2024 | 03:50 AM