Voter New Enrollment: ఓటు నమోదుకు ఆఖరి అవకాశం
ABN , Publish Date - Apr 14 , 2024 | 01:20 AM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. శాసన కర్తలను, నేతలను ఎన్నుకునేందుకు వయోజనులందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఓటు. అర్హత ఉన్నా ఓటు హక్కు లేని వారికి, 18 ఏళ్ళు నిండినవారు కొత్తగా ఓటు వేసేందుకు చాలామంది ఆశక్తి చూపడంలేదు.
రేపటితో ముగియనున్న గడువు
ఓటు హక్కు నమోదు, వినియోగంపై విస్తృత ప్రచారం
ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు
పట్టణాలు, నగరాలు, యువతే టార్గెట్
కాలనీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
సామర్లకోట, ఏప్రిల్ 13: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు(Vote) వజ్రాయుధం వంటిది. శాసన కర్తలను, నేతలను ఎన్నుకునేందుకు వయోజనులందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఓటు. అర్హత ఉన్నా ఓటు హక్కు లేని వారికి, 18 ఏళ్ళు నిండినవారు కొత్తగా ఓటు వేసేందుకు చాలామంది ఆశక్తి చూపడంలేదు. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతా ల్లో ఓటింగ్ శాతం మరింత తక్కువ నమోదవుతుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటు హక్కును పొందడంతోపాటు ఎన్నికలలో ఓటు హక్కుపై ప్రజలకు వివరిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో ఓటు హక్కు ప్రాముఖ్యతపై తెలియ జేస్తున్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచేలా అధికారులు, యంత్రాంగం కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు సమీపిస్తోంది. 18 ఏళ్లు నిండిన వారితో పాటూ అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన ఓటరుగా పేరు నమోదు చేసుకోని వారు ఇక ఆలస్యం ఎంతమాత్రం చేయకుండా తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసే అవకాశం లభిస్తుంది. ఈ మే నెల 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అర్హత ఉన్న వారంతా ఓటరుగా పేరు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే పట్టణాలు, నగర ప్రాంతాలలో చదువుకున్నవారు అధికంగానే ఉన్నప్పటికీ ఓటరుగా పేరు నమోదు, ఓటుహక్కు వినియోగం విషయంలో ప్రజలు ఆశక్తిచూపడంలేదు. గ్రామీణులతో పోలిస్తే పట్టణాలు, నగరాలలో ఓటింగ్ ప్రక్రియల్లో పాల్గొంటున్న వారి సంఖ్య తక్కువే ఉంటోంది. ఇది ప్రతీ ఎన్నికలలోనూ నిరూపితం అవుతుంది.
ఓటు విలువ తెలియక తమ పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా నగర, పట్టణాలు, తదితర శివారు ప్రాంతాలలో వలస కూలీలు, సంచార జీవులు లక్షలాది మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. కొందరు తమకు అర్హత ఉన్నా ఓటరుగా పేరు కూడా నమోదు చేసు కోవడం లేదు. పట్టణ, నగర ప్రాంతాలు అభివృద్ధితో ముందుకు వెళుతున్నా ఎన్నికలలో ఓటు వేసే విషయంలో మాత్రం వెనుకబడే ఉంటున్నారు. ఎన్నికల రోజును చాలా మంది ఓ సెలవు దినంగానే చూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో కొన్ని పట్టణ ప్రాంతాలు సైతం ఓటింగ్ శాతం 60 శాతానికి మించకపోవడం గమనార్హం. వీటిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రెండు నెలల ముందుగానే ఎన్నికల కమీషన్ అధికారులు కార్యాచరణ మొదలెట్టారు.
ఓటు హక్కు విని యోగంపై ప్రజలను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో)తో పాటూ తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలలో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ జాబితాలను పరిశీలించి జాబితాలో తమపేరు ఉందో లేదో చూసుకోవాలి. మున్సిపాల్టీలలో మున్సిపల్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఎన్నికల సంఘం ఓటరు సర్వీస్ పోర్టల్‌తో పాటు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి గడువు మాత్రం ఏప్రిల్ 15 అని మాత్రం అందరూ గుర్తించాలి.
ఓటు హక్కు పొందేందుకు వీరంతా అర్హులే..
జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులే. 2006 మార్చి 31లోగా పుట్టిన వారంతా ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. దరఖాస్తుకు వయస్సు ధ్రువపత్రంతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫోటో జతపరిచి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలి. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు, అన్ని అర్హతలున్నా ఇప్పటివరకూ ఓటరుగా నమోదు చేసుకోని వారంతా ఫారం-6 ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు నమోదుకు వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు అన్నీ ఓకే అయిన తరువాత కొన్ని రోజులలో ఇళ్ల వద్దకే ఓటరు గుర్తింపు కార్డును పంపిస్తారు. సంబంధిత ప్రాంత బూత్‌లెవెల్ అధికారులు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. ఒకవేళ గుర్తింపు కార్డు రాకున్నా ఆన్‌లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు దరఖాస్తులు చేసుకునే సమయంలో దరఖాస్తు రిజెక్ట్ కాకుండా నిర్ణీత ప్రొఫోర్మాలో ఆధార పత్రాలతో జతపర్చి దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా జెరాక్స్ పత్రాలను జతచేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫోటోను ప్రొఫోర్మాలో అడిగిన ఇతర వివరాలను సమర్పిస్తే దరఖాస్తు రిజెక్ట్ కాకుండా ఓటరుగా నమోదవుతారు.
యువతే లక్ష్యంగా వివిధ అవగాహన కార్యక్రమాలు..
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల కమీషన్ స్వీప్( సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలకో్ట్రరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి జిల్లాలో స్వీప్ కార్యక్రమ నిర్వహణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించారు. ముఖ్యంగా ఓటింగ్ శాతం తక్కువ నమో దయ్యే పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాలలో వినూత్న రీతిలో ఓటర్ల చైతన్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను చైతన్యపరిచేందుకు కళాశాలల్లో కూడా వినూత్న అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులకు ఓటు నమోదుతోపాటూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన ఏర్పరుస్తున్నారు.
ప్రతీ కళాశాలలో క్యాంపస్ అంబాసిడర్‌లను నియమించారు. వీరు మిగతా విద్యార్థులకు ఓటరుగా నమోదుకావడానికి తోడ్పడుతున్నారు. ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులను చైతన్యపరిచే పిల్లలతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ఓటేస్తా, 5కె రన్, 2కె రన్, ప్రతిజ్ఞలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్‌లు, ట్రాన్స్‌జెండర్లు, యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్, సైకిలిస్ట్ అసోసియేషన్లు, పోలీసులు, విద్యార్థులను ఈ కార్యక్రమాలలో భాగస్వాములుగా చేస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎంకే మీనా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ (నేను తప్పకుండా ఓటు వేస్తాను) వంటి నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.
25న అనుబంధ జాబితా..
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను గత ఫిబ్రవరి 8న ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో మరోసారి జాబితా సవరణ చేపట్టారు. దీని ప్రకారం ఈనెల 15 తేదీ వరకూ ఓటరు నమోదు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారి పేర్లను అనుబంధ జాబితాలో చేరుస్తారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలన్నా, అభ్యర్థులుగా పోటీ చేయాలన్నా ఓటరు జాబితాలో పేరుంటేనే సాధ్యం అవుతుంది. ఓటు హక్కు అర్హత ఉండి జాబితాలో పేరులేని వారందరూ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే రాజకీయ పార్టీల నాయకులు, చదువుకున్న వారు ఓటరు జాబితాలో పేరు నమోదు, సవరణలపై తెలియని వారికి తెలియజెప్పాలి. ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకోవాలని, పేరు లేకుంటే దరఖాస్తు కోసం ప్రోత్సహించాలి.
పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే.. ఓటు దుర్వినియోగం కాకుండా నోటా..
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఓటు దుర్వినియోగం కాకుండా నోటాకు ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులతో పాటు నోటా ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. నోటా బటన్ నొక్కితే ఓటు ఏ పార్టీకి పడదు. కానీ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగానే ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. సాధారణంగా ఎన్నికల సమయంలోనే నోటా అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల నుంచి నోటాకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నచ్చకపోతే చాలా మంది ఓటు వేయకుండా మిగిలిపోతున్నారు. అలాంటివారు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు తమ నిరసనను తెలియచేసేందుకు నోటా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించేందుకు నోటాను తీసుకువచ్చారు. బరిలో నిలబడ్డ కొందరు అభ్యర్థులకంటే నోటాకు పడ్డ ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌కు దరఖాస్తు..
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ఫారం-12డిని పూర్తిచేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. 85ఏళ్లు పైబడినవారు, 40 శాతం దివ్యాంగత్వం ఉన్నవారు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు అర్హులుగా నిర్థారించారు. ఇంటి వద్దే ఓటు వేసే ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. ఓటు ఎవరికి వేసారో తెలియకుండా గోప్యతను పాటించేలా రహస్య ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు.