జల్లెడ పట్టి.. జాడ కనిపెట్టి!
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:22 AM
అమలాపురం/పి.గన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన కేసును కొత్తపేట సబ్‌డివిజన్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగానే చిన్నారులను గుర్తించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మీడియాకు వివరించారు. కండ్రిగపేటకు చెందిన

ఆరుగురి విద్యార్థుల అదృశ్యం కేసును
24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
కోనసీమ జిల్లా ఎస్పీ అభినందనలు
అమలాపురం/పి.గన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన కేసును కొత్తపేట సబ్‌డివిజన్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగానే చిన్నారులను గుర్తించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు మీడియాకు వివరించారు. కండ్రిగపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు మూడు వేర్వేరు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. కొమరగిరి కరుణ (14) కండ్రిగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి, కొమరగిరి మాధురి (12) రామచంద్రపురంలో ఏడో తరగతి, కొమరగిరి పృథ్వివర్మ (12) 6వ తరగతి, గంధం సత్యనారాయణ (13) 8వ తరగతి, మర్రిసంతోష్ (14) ఏడో తరగతి, కొమరగరి పండు (12) 6వ తరగతి ఆలమూరు మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు సరిగా చదవకపోవడం, పాఠశాలకు కూడా సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దాంతో ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా వారి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఆచూకీ కోసం అన్నిచోట్లా గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ఆలమూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బాల బాలికల అదృశ్యంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించి కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను నియమించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, భీమవరం జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపించి రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్లలో విచారణ చేశారు. డ్రోన్ కెమెరాలు వినియోగించారు. చివరకు వారు రావులపాలెం బస్టాండు నుంచి రాజోలు వైపు వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం, పి.గన్నవరం సీఐలు సీహెచ్ విద్యాసాగర్, రుద్రరాజు భీమరాజు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పి.గన్నవరం మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. చివరకు యర్రంశెట్టివారిపాలెంలో విద్యార్థుల జాడను గుర్తించి వారిని జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకువచ్చారు. కేసు నమోదైన 24 గంటల్లోగానే చేధించిన పోలీసు అధికారులతో పాటు ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట ఎస్‌ఐలు అశోక్, చిరంజీవి, రాజేష్‌లు, సిబ్బందిని ఎస్పీ, అదనపు ఎస్పీ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి అవార్డులు అందించారు. విద్యార్థులను అప్పగిస్తున్న సమయలో తల్లిదండ్రులు డీఎస్పీ మురళీమోహన్ కాళ్లపై పడి పాదాభివందనం చేశారు. విద్యార్థుల అదృశ్యంపై సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.