Share News

AP Politics: జగన్‌కు ఏమని చెప్పావ్‌ అవినాశ్‌?

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:33 AM

‘‘మీ ఫోన్‌ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్‌ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని

AP Politics: జగన్‌కు ఏమని చెప్పావ్‌ అవినాశ్‌?
YS Sunitha

  • వివేకాది గుండెపోటు అని చెప్పావా?

  • హత్యకు గురయ్యారని చెప్పావా?

  • అక్కడి దృశ్యం చూస్తే గుండెపోటు కాదని తెలుస్తుంది

  • హత్య అంటే డీజీపీని జగన్‌ అలర్ట్‌ చేయాలి కదా!

  • మీ ఫోన్‌ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా!

  • వివేకా గురించి ఏనాడైనా మంచిగా రాశారా?.. అన్ని ఆధారాలూ ఉన్నాయి

  • రాజకీయంగా అడ్డుకోవడంవల్లే దర్యాప్తులో జాప్యం.. వైఎస్‌ సునీత ధ్వజం

కడప, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఫోన్‌ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్‌ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని వైఎస్‌ సునీత ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆమె కడపలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ జగన్‌కు అవినాశ్‌ ఏమని చెప్పాడు? గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని చెబితే.. అక్కడి దృశ్యం చూడగానే జగన్‌కు అసలు అక్కడ ఏమి జరిగిందో తెలిసి ఉండాలి. ఒకవేళ హత్య అని చెబితే వెంటనే ఆయన డీజీపీని ఎందుకు అప్రమత్తం చేయలేదు’’ అని సునీత ప్రశ్నించారు. తనకు ఈర్ష్య అంటున్నారని, అవినాశ్‌రెడ్డితో పెద్ద పరిచయం లేని తనకు ఆయనపై ఎందుకు ఈర్ష్య ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ‘‘ నేను 2008లో అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడ స్పెషలిస్టుగా పనిచేస్తున్నాను. నాకు రాజకీయ ఆసక్తులు లేవు. అలాంటప్పుడు ఈర్ష్య ఎందుకు ఉంటుంది? పులివెందులలోని రాజారెడ్డి స్ర్టీట్‌లో ఉన్నప్పుడు.. చుట్టపుచూపుగా అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లేదాణ్ణి. ఇప్పుడు వారి ఇల్లు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. వివేకా హత్య ఘటన తర్వాత ఆయన ఇంటికి ఒక్కసారి వెళ్లాను. అవినాశ్‌ అంత పరిచయం లేదుగానీ ఆయన చెల్లెలితో పరిచయం ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. కానీ, పెద్ద పరిచయం లేని అవినాశ్‌ అంటే నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? అధికారానికి దూరంగా ఉండాలనుకన్నా. కానీ, ఇక్కడకు రావాల్సి వచ్చింది’’


ఒత్తిళ్లు లేకపోతే హెడ్‌ కానిస్టేబుల్‌ సరిపోతాడు..

‘‘వైఎస్‌ వివేకా హత్య కేసు రాజకీయంగా వెళ్లకుండా ఉంటే ఒక హెడ్‌కానిస్టేబుల్‌ సాల్వ్‌ చేసే కేసు. అన్నీ ఆధారాలు ఉన్నాయి. ఐదేళ్లు కావస్తున్నా రాజకీయనేతల వల్ల ఇప్పటికి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంకా ఎంతకాలం సాగుతుందో తెలియదు కానీ సాగుతూనే ఉంది. అప్రూవర్‌ స్టేటస్‌ అనేది చట్టంలో ఒక ప్రాసెస్‌. కానీ నేను అడిగేది న్యాయం. అప్రూవర్‌ స్టేటస్‌ అన్నది కోర్టుకు, సీబీఐకి, అప్రూవర్‌కి మధ్యన ఉండేది. అప్రూవర్‌ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు. అప్రూవర్‌గా ఆయన చెప్పేది జడ్జి కన్విన్స్‌ అయితే ఉంటారు.. లేకపోతే మిగిలిన నిందితుల మాదిరిగా జైలుకు వెళ్తారు. అప్రూవర్‌ తప్పించుకుంటారన్నది ఏదీ లేదు. అప్పటివరకు కోర్టు గురించి తెలియదు. రంగన్న స్టేట్‌మెంట్‌ తర్వాత దర్యాప్తు ఆలస్యం అవుతూ వచ్చిందని అవినాశ్‌ అన్నారు. నేను కూడా అదే కదా అడుగుతున్నా.. ఎందుకు ఇన్నేళ్లయినా జాప్యం అయింది? అందువల్లే దయచేసి రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని కోరుతున్నాం’’


ఎవరితో మాట్లాడినా రాజకీయమేనా?

‘‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ సతీమణి చనిపోతే ఆయన నేను ఇంటికి వెళ్లానని చెబుతున్నారు. అవును.. ఆమె నా పేషెంట్‌ కాబట్టే వెళ్లాను. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ల అన్న కూడా చనిపోయారు.. అదేవిధంగా వాళ్ల ఇంటికి వెళ్లాను అది ఆయనకు గుర్తుకు రాలేదు. డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి చనిపోయినపుడు భారతిని కూడా కలిశాను.. అది గుర్తుకు రాలేదా? ఇది మానవత్వానికి సంబంధించింది’’

ఒక్కనాడైనా పరామర్శించారా?

‘‘వైఎస్‌ వివేకా తమ కోసం చాలా కృషిచేశారని అవినాశ్‌రెడ్డి అన్నారు. వివేకా అంత దారుణంగా హత్యకు గురైతే ఆయన సంగతి, ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా అడిగారా? పోలీసుల వద్దకెళ్లి కేసు గురించి ఆరాతీశారా? ఢిల్లీకి అన్నిసార్లు వెళుతుంటారు కదా.. ఒక్కసారైనా సీబీఐ ఆఫీసుకు పోయి కేసు గురించి మాట్లాడారా? ఆయన గురించి ఒక్కరోజు అయినా మంచిగా జగన్‌ పత్రికలో రాశారా? గూగుల్‌ టేకౌట్‌ ఫ్యాబ్రికేటెడ్‌ అంటారు.. ఈ గూగుల్‌ టేకౌట్‌ను సీబీఐ కాకుండా, సీఎ్‌ఫఎ్‌సఎల్‌, సర్వే ఆఫ్‌ ఇండియా అందరు కలిపి తయారు చేసిన రిపోర్టు అన్నారు. అంటే వీళ్లందరు ఫ్యాబ్రికేటెడా? 1000మీటర్లు ఉన్నా కూడా గూగుల్‌ టేకౌట్‌ స్పష్టంగా చెబుతుంది. వాట్స్‌పలో కాల్స్‌ ఉన్నట్లు తేల్చింది.


జగన్‌కు ఏమని చెప్పారు?

‘‘వివేకా చనిపోయిన రోజు.. అవినాశ్‌కు శివప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్‌ పోయింది 6 గంటల 26 నిమిషాల 15 సెకండ్లకు. ఫోన్‌ కాల్‌ డ్యురేషన్‌ 24 సెకండ్లు. అవినాశ్‌రెడ్డితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారంటున్నారు.. వాళ్లలో ఒకరు గజ్జల ఉదయకుమార్‌రెడ్డి ఏ-6. గూగుల్‌ టేకౌట్‌ ప్రకారం అవినాశ్‌రెడ్డి ఇంట్లో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి 6 గంటల 25 నిమిషాల 25సెకండ్లకు ఉన్నాడని ఇది చార్జిషీట్‌లో ఉంది. మళ్లీ 6గంటల 27నిమిషాల 28 సెకండ్లకు వివేకానందరెడ్డి ఇంటివద్ద ఉన్నాడు. ఈ సమయాన్ని బట్టి చూస్తే అందరూ ఒకేచోట ఉన్నారు. అవినాశ్‌ ఎక్కడో దారిలో ఉంటే వివేకా ఇంటికి 47 సెకండ్లలో ఎలా చేరుకున్నాడు? ఇది గూగుల్‌ టేకౌట్‌, సీడీఆర్‌ కంబైన్డ్‌ డేటా. ఇది చార్జిషీట్‌లో ఉంది. 6.30గంటల ప్రాంతంలో వివేకా ఇంటికి చేరుకున్నాడు. అక్కడి దృశ్యం చూశాడు. అయితే, బయటకు వచ్చి ఏం చెప్పాడు? నవీన్‌కి ఫోన్‌ చేశాడు. ఓఎస్డీ కృష్ణమోహన్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు.. వాళ్ల ద్వారా జగన్‌కు సమాచారం అందించామని చెప్పాడు. జగన్‌కు వివేకాది గుండెపోటు అని చెప్పారా? లేక హత్య అని చెప్పారా? ఏమని చెప్పారు. గుండెపోటు అని చెబితే.. అక్కడి దృశ్యం చూడగానే జగన్‌కు అసలు ఏమి జరిగిందో తెలిసి ఉండాలి. ఒకవేళ హత్య అని చెబితే వెంటనే ఆయన డీజీపీని ఎందుకు అప్రమత్తం చేయలేదు’’

వివేకా చివరి కోరిక ఒక్కటే..

‘‘వివేకాకు ఆస్తుల సమస్య లేదు. ఆయన ఆఖరి కోరిక షర్మిలను ఎంపీగా చేయడమే. హత్య విషయంలో నాకంటే ముందే పులివెందుల ప్రజలందరికీ తెలుసు. కానీ, అవినాశ్‌రెడ్డి ఏమీ తెలియనట్లు ఉంటారు. ఆయన వెనుక ఇంత కుట్ర ఉంటుందని నాకు తెలియదు. ప్రజలు కూడా తెలుసుకుంటారు’’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 08:32 AM