Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో వైసీపీ నేత
ABN , Publish Date - May 25 , 2024 | 04:07 AM
బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..
చిత్తూరు జిల్లా తవణంపల్లెకు చెందిన..
అరుణ్‌కుమార్‌ను ఏ2గా పేర్కొన్న పోలీసులు
ఈయన సజ్జల కుమారుడికి రైట్‌హ్యాండ్: టీడీపీ
చిత్తూరు, మే 24(ఆంధ్రజ్యోతి): బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్ (Bangalore Rave Party) పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. ఆ కేసులో ఏ2గా ఉన్న అరుణ్‌కుమార్ చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రేవ్ పార్టీ నిర్వాహకుల్లో ఒకరైన అరుణ్‌కుమార్ చాలా కాలంగా బెంగళూరులోనే స్థిరపడినా.. సొంతూరు మాత్రం తవణంపల్లె మండలం మడవనేరి గ్రామం.
పరిచయం ఎలా..?
ఈ కేసులో ప్రధాన నిందితుడు, విజయవాడకు చెందిన లంకపల్లె వాసుకు.. అరుణ్‌కుమార్ స్నేహితుడు. వాసుతో కలిసి అరుణ్‌కుమార్ క్రికెట్ బెట్టింగులు, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. అరుణ్‌కుమార్ తెలివైనవాడని, ఉన్నత విద్యావంతుడని, ఇలాంటి చెడు అలవాట్లకు బానిస కావడం బాధాకరమని గ్రామస్థులు అంటున్నారు. అరుణ్‌కుమార్ సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్‌ను సన్మానిసున్న, రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేసుకున్నారు. ‘‘దేశంలో ఎక్కడ అక్రమం జరిగినా దాని లింకు వైసీపీతో ఉండాల్సిందే. అందులోనూ డ్రగ్స్ వ్యవహారం అయితే తప్పనిసరి. బెంగళూరు రేవ్ పార్టీ నిందితుల్లో ఏ-2 అరుణ్ ఎవరో కాదు.. సజ్జల భార్గవ్‌కి రైట్ హ్యాండ్’’ అని అరుణ్‌కుమార్ గురించి శుక్రవారం సోషల్ మీడియాలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోస్ట్ చేసింది.