దీపావళి నుంచే ఉచిత గ్యాస్
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:57 AM
టీడీపీ కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలుకు ముహూర్తం ఫిక్సయింది.
సూపర్ సిక్స్‌లో ఒక పథకం అమలుకు ముహూర్తం
తెల్లకార్డుదారుల్లో అర్హులందరికీ లబ్ధి
సర్కారుపై ఏటా రూ.3 వేల కోట్లు భారం
23న కేబినెట్‌లో ఆమోదం: మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలుకు ముహూర్తం ఫిక్సయింది. దీపావళి రోజున ఆ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న దీపావళి నుంచి తెల్లకార్డుదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్ సిక్స్‌లో కీలక హామీగా ఉన్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. దీనిపై ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామన్నారు. విధి విధానాలను కూడా త్వరలో వెల్లడించనున్నట్టు చెప్పారు. దీపావళి నాటికి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతాయన్నారు. పండుగ రోజు పేదల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు తాపత్రయ పడుతున్నారని మనోహర్ అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి రూ.3000 కోట్లు ఖర్చవుతుందని మంత్రి చెప్పారు. కేంద్రం సహకారంతో పథకాల అమలుకు ముందడుగు వేస్తామన్నారు. రాష్ట్రంలో 1.4 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారుల్లో అర్హులందరికీ ఉచితంగా మూడు సిలెండర్లు అందిస్తామన్నారు. దీనికోసం హిందూస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ గ్యాస్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీకి తోడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు వారి సహకారం తీసుకోనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తామిచ్చిన హామీలు అమలు చేయడం కొంత ఇబ్బందిగా ఉన్నమాట నిజమేనని, దీనికితోడు గత ప్రభుత్వం చేసిన పాపాలనూ కడగాల్సి వస్తోందని విమర్శించారు. అయినా పథకాల అమలులో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నారు.
రైతులకు జగన్ పెట్టిన బకాయిలూ చెల్లించాం
పౌరసరఫరాల శాఖ ద్వారా గత ప్రభుత్వ కాలంలో రైతుల నుంచి కొన్న ధాన్యానికి డబ్బు చెల్లించలేదని, ఆ బకాయిలు రూ.1674కోట్లు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సరకులు అందించిన కంపెనీలకు సైతం జగన్ సర్కారులో బకాయిలు పేరబెట్టారని, ఆ అప్పులు కూడా తామే కడుతున్నామని మంత్రి చెప్పారు. పథకాల అమలుకు తీసుకొచ్చిన అప్పులు ఏ ప్రభుత్వం ఉన్నా చెల్లించడం సహజమేనని, అయితే, జగన్ సర్కారులో సొంత ఖజానా నింపుకొనేందుకు అమలు చేసిన పథకాల డబ్బులు కూడా చెల్లించాల్సి రావడం భారంగా మారిందని ఆయన అన్నారు. గతంలో మాదిరి కాకుండా తమ ప్రభుత్వంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను అందించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల పఽథకాన్ని ప్రతి మహిళ సంతోషపడేలా, చరిత్రలో నిలిచిపోయేలా అందిస్తామని ఆయన తెలిపారు.