Ram Prasad Reddy: వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ
ABN , Publish Date - Jul 30 , 2024 | 06:44 PM
రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందన్నారు. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు భూముల ఆక్రమణలపై ఆదేశించారని తెలిపారు.
మంగళవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ... పెద్ద ఎత్తున 22ఏ భూముల రికార్డులు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ధ్వసం చేశారని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డులను కాల్చివేశారని చెప్పారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారన్నారు. ఆ అధికారులే భూ రికార్డుల కాల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డులను కాల్చివేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. అనేకమంది బాధితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ భూ దోపిడీ పైన ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ప్రజలను బయపెట్టి పెద్దిరెడ్డి పెద్దఎత్తున దోపిడీ చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
రూ.40 వేల కోట్లు భూ అక్రమాలు గత ప్రభుత్వం హయాంలో జరిగాయని స్పష్టం చేశారు. భద్రత కోసం కూడా పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. కావాలనే దాడులు సృష్టించుకుని, పోలీసుల వైఫ్యలం పేరుతో డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పరదల ముఖ్యమంత్రి పాలన పోయి.. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని ఉద్ఘాటించారు. 60 రోజులు నుంచి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. మదనపల్లి ఘటనపై జగన్మోహన్ రెడ్డి చర్చకు ఎక్కడకు వచ్చిన తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులకు గన్ మాన్‌లను తొలగించారని గుర్తుచేశారు. ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్‌లు ప్రారంభిస్తామని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.