Share News

Pawan Kalyan: వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు.. వేటగాళ్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:59 PM

చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్న్య ప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Pawan Kalyan: వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు.. వేటగాళ్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

అమరావతి: చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిరుతపులి దాని గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దాని దంతాలు కూడా తొలగించిన ఘటన అమానవీయమని పవన్ కళ్యాణ్ అన్నారు.


చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని అన్నారు. ఏపీవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.


తాళ్లమడుగు గ్రామ సమీపంలో చిరుతపులి మృతి..

కాగా.. వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుతపులి మృతిచెందింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారుల కథనం మేరకు... అటవీ ప్రాంతంలో దుర్వాసన వస్తోందని, అక్కడో చిరుత కళేబరం పడి ఉందని పశువుల కాపర్లు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు డీఎఫ్‌వో భరణి, ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ఈశ్వర్‌ సిబ్బందితో కలసి వెళ్లి పరిశీలించారు. చిరుత మరణించి నాలుగైదు రోజులు అయిందని, చిరుత కాళ్లు, దంతాలు కనిపించకపోవడంతో అపహరించారని నిర్ధారించారు. చిరుత కళేబరానికి తిరుపతి జూ వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించాక అటవీశాఖ అధికారులు దహనం చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 10:12 PM