Share News

AP News: విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ ఆటలు.. గెంటేస్తున్నారు!

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:38 AM

విద్యార్థుల జీవితాలతో జగన్‌ సర్కారు ఆడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబరులో ఇవ్వాల్సిన ఫీజులకు సీఎం జగన్‌ ఈ నెల ఒకటో తేదీన బటన్‌ నొక్కారు. ఆయన బటన్‌ నొక్కి 20 రోజులు అవుతున్నా

AP News: విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ ఆటలు.. గెంటేస్తున్నారు!

  • రాష్ట్రంలో విద్యార్థుల చదువులు బలి

  • డబ్బుల్లేకుండా ‘విద్యాదీవెన’కు ఉత్తుత్తి బటన్‌ నొక్కుడు

  • ఈనెల1న విడుదల.. ఇప్పటికి అందింది 10 శాతమే

  • 90 శాతం మందికి ఇంకా ఫీజులు అందని వైనం

  • ఫీజులు కట్టాలంటూ కాలేజీల నుంచి ఒత్తిడి

  • పలుచోట్ల ఇంటికి పంపుతున్న దైన్య పరిస్థితి

  • క్లాసులకు రావొద్దని గుంటూరులో ఓ కాలేజీ మెసేజ్‌

  • టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు నిధులు

  • ‘కాలేజీ- ప్రభుత్వం’ వ్యవహారంగా ఫీజులు

  • ‘తల్లిదండ్రులు-కాలేజీ’గా మార్చడంతోనే తిప్పలు

  • డబ్బు వస్తుందన్న నమ్మకం కోల్పోయిన కాలేజీలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యార్థుల జీవితాలతో జగన్‌ సర్కారు (Jagan Govt) ఆడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబరులో ఇవ్వాల్సిన ఫీజులకు సీఎం జగన్‌ ఈ నెల ఒకటో తేదీన బటన్‌ నొక్కారు. ఆయన బటన్‌ నొక్కి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ డబ్బులు అడ్రస్‌ లేవు. కానీ సీఎం బటన్‌ నొక్కినందున ఫీజులు కట్టాల్సిందేనంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. పలుచోట్ల తరగతులకు హాజరు కానివ్వకుండా విద్యార్థులను ఇంటికి పంపుతున్నాయి. డబ్బుల్లేకుండానే జగన్‌ బటన్‌ నొక్కడంతో కాలేజీలకు సమాధానం చెప్పలేక, ప్రభుత్వం నుంచి ఫీజులు ఖాతాల్లో పడక విద్యార్థులు సతమతమవుతున్నారు. మొత్తంగా విద్యార్థుల చదువులను బలిపెట్టేలా డబ్బుల్లేని విద్యా దీవెన పథకాన్ని జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9.44లక్షల మంది విద్యార్థులకు రూ.708కోట్లు విడుదల చేస్తూ ఈ నెల ఒకటో తేదీన జగన్‌ బటన్‌ నొక్కారు. రోజులు గడుస్తున్నా... ఎన్నిసార్లు అకౌంట్‌ చూసుకున్నా డబ్బులు మాత్రం కనిపించట్లేదు. తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు జమచేశామని ప్రభుత్వం చెబుతుంటే, ఇప్పటికీ ఆ డబ్బులు తమకు చేరలేదని వారంటున్నారు. అయితే ఫీజులు విడుదల చేశాం అని సాంకేతికంగా చెప్పుకొనేందుకు ప్రభుత్వం అక్కడక్కడా కొందరికి ఫీజులు ఖాతాల్లో జమచేసింది. కానీ 90శాతం మందికి మాత్రం ఇంకా ఫీజులు రాలేదు.

ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, మెడిసిన్‌ కోర్సులు చదువుతున్న 9,44,666 మంది విద్యార్థులకు అక్టోబరు-డిసెంబరు 2023 క్వార్టర్‌ ఫీజులు విడుదల చేసినట్లు ఈనెల 1న బటన్‌ నొక్కినప్పుడు సీఎం జగన్‌ తెలిపారు. రూ.708.68కోట్లు విడుదల చేశామన్నారు. అదే రోజు నుంచి ఫీజులు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి ప్రారంభించాయి. ఇంకా ఫీజుల డబ్బులు అకౌంట్‌లో పడలేదని చెబుతున్నా, అదంతా తమకు సంబంధం లేదని, వెంటనే ఫీజులు కట్టాలని తేల్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఫీజులు ఇవ్వలేనప్పుడు బటన్‌ నొక్కకుండా ఉండాలని, బటన్‌ నొక్కి మేనేజ్‌మెంట్ల ముందు విద్యార్థులను ఇరికిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పరీక్షలు ఉండటంతో కాలేజీలు హాల్‌టికెట్లు ఇవ్వవేమోనన్న ఆందోళన విద్యార్థుల్లో పెరిగింది. అసలే ఎన్నికలు కావడంతో ప్రభుత్వం పట్టించుకోదేమోనని భయపడుతున్నారు.

క్వార్టర్‌పైనా అబద్ధాలు

ప్రభుత్వం ఏటా నాలుగు విడతలుగా ఫీజులు విడుదల చేయాలి. ఏ క్వార్టర్‌ ఫీజులు అదే క్వార్టర్‌లోనే ఇస్తున్నామని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. 2023-24 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు క్వార్టర్ల ఫీజులు విడుదల చేయాలి. మరో రెండు వారాల్లో మూడో క్వార్టర్‌ విడుదల కావాలి. కానీ జగన్‌ బటన్‌ నొక్కి ఇచ్చింది ఈ విద్యా సంవత్సరంలో మొదటి క్వార్టర్‌ ఫీజులే. కానీ ప్రభుత్వం మాత్రం రెండో క్వార్టర్‌ అని ప్రచారం చేసుకుంటోంది. ఇలా ఏటా మూడు క్వార్టర్లు ఆలస్యంగా ఫీజులు విడుదల చేస్తోంది. కొందరు విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేశాక ఫీజులు కడుతుంటే, కాస్త మంచి పేరున్న కాలేజీలు ముందుగానే ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో వేరే దారిలేక తల్లిదండ్రులు అప్పులుచేసి ముందుగానే ఫీజులు కడుతున్నారు.

మా ఖాతాల్లో వేయొద్దు

గత ప్రభుత్వంలో రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ఇచ్చే ఫీజులు నేరుగా కాలేజీల ఖాతాల్లో వేసేవారు. కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే నెపంతో జగన్‌ ప్రభు త్వం తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు జమచేసే విధానం అమలుచేస్తోంది. అయితే నెపం కాలేజీలపై నెట్టినా, ఈ కొత్త విధానంలో అసలు బాధితులుగా మారింది విద్యార్థులు. ఎందుకంటే గతంలో ఫీజుల అంశం ప్రభుత్వం- కాలేజీల మధ్య ఉండేది. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు కాలేజీలు ఫీజులు తీసుకునేవి. కానీ జగన్‌ ప్రభుత్వం ఫీజులను కాలేజీలు-తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు ఫీజులు విడుదల చేసినా కాలేజీలు మాత్రం ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి. దీంతో అసలు ఈ విధానమే వద్దని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

తొలినుంచీ ఇలాగే.....

‘‘క్వార్టర్‌ ముగిసిన వెంటనే తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు వేస్తున్నాం’’ అని ప్రతిసారీ విద్యా దీవెన ఫీజులు విడుదల చేసే సమయంలో ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంటోంది. కానీ గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా క్వార్టర్‌ ముగిసిన వెంటనే ఫీజులు ఇచ్చిన దాఖలాల్లేవు. ప్రతిసారీ కనీసం మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో పెట్టి పాత ఫీజులు విడుదల చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మూడో క్వార్టర్‌ ముగుస్తున్నప్పుడు మొదటి క్వార్టర్‌ నగదు వేశారు. ఆయా కోర్సుల్లో చివరి ఏడాది విద్యార్థుకు ఇది ఇంకా ఇబ్బందిగా మారింది. ఫీజులు కట్టలేదనే ఫైనలియర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో ఫైనలియర్‌ విద్యార్థులకు 3, 4 క్వార్టర్ల నగదు ఒకేసారి ఇస్తామని గతేడాది ప్రభుత్వం తెలిపింది. అయితే అసలు మొదటి క్వార్టర్‌ ఫీజులే మూడో క్వార్టర్‌లో ఇస్తుంటే, ఇక 3, 4 క్వార్టర్లు ఎప్పుడిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

సీఎం జిల్లాలోనూ..

  • సీఎం సొంత జిల్లా కడపలో 44,876 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.32.52 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ, ఇంత వరకు ఆ నిధులు జమ కాలేదు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ఈ నెల 20లోగా ఫీజు చెల్లించాలి. అప్పుడే వారికి హాల్‌టికెట్‌ ఇస్తామని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి.

  • నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులకు విద్యా దీవెన అందలేదు. వెయ్యి మంది విద్యార్థులున్న ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎవరికీ ఫీజులు పడలేదు. 40 మంది సొంతంగాఫీజులు కట్టారు. మిగిలినవారిపై యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది.

  • పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 20ు మందికి మాత్రమే ఫీజులు పడ్డాయి. ఫీజులు కట్టకపోతే హాల్‌ టికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. దీంతో అప్పులు చేసైనా ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • విశాఖపట్నం జిల్లాలో అన్ని విడతల ఫీజులూ కట్టాలని కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఒక్క విడత విడుదల చేయగా, మిగిలిన మూడు విడతల ఫీజులూ కలిపి కట్టాల్సిందేనని స్పష్టంచేస్తున్నాయి. ఇక... ఏడాదికి రెండు విడతల్లో వసతి దీవెన నగదు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ ఒక్క విడత కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలో 44వేల మంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.

  • జగన్‌ బటన్‌ నొక్కిన గత 20 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనీసం 5 శాతం మందికి కూడా డబ్బులు పడలేదు. ఇక్కడి ఇంజనీరింగ్‌ కళాశాలలు, మరో 25పైగా ఫార్మసీ ఇతర వృత్తి విద్యా కళాశాలలకు ఇంకా రెండు విడతల ఫీజులు అందాల్సి వచ్చింది. డబ్బులు ఖాతాల్లో పడకపోవడం, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొన్ని కళాశాలలు... ఫీజులు చెల్లించే వరకు క్లాసులకు రావద్దు అని వాట్సప్‌ సందేశాలు పంపుతున్నాయి.

  • విశాఖ జిల్లాలో డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, ఐటీఐ కోర్సుల్లో సుమారు 44వేలమంది చదువుతున్నారు. 2023-24 సంవత్సరానికి గాను నాలుగు విడతల్లో జమ కావాల్సిన విద్యా దీవెనను ఇప్పటివరకు ప్రభుత్వం ఒక విడత మాత్రమే చెల్లించింది. మిగిలిన మూడు విడతలు చెల్లించాల్సిందిగా ఇంజనీరింగ్‌, ఐటీఐ, డిగ్రీ కోర్సుల్లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.

Updated Date - Mar 19 , 2024 | 07:34 AM