AP News: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 29 , 2024 | 09:13 PM
కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మదనపల్లి ఫైళ్ల దహనం వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్ పాత్రపై రాజా ఆరోపణలు గుప్పించారు.

పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మదనపల్లి ఫైళ్ల దహనం వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్ పాత్రపై రాజా ఆరోపణలు గుప్పించారు. పైళ్ల దహనం కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అనిల్ కుమార్ పాత్ర బయటపడుతుందని వ్యాఖ్యానించారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవినీతికి అంతే లేదని, కనీసం ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో అనిల్ కుమార్ ఉన్నాడని మండిపడ్డారు.
‘‘ హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న అతడి సొంత ఇంటిని అనిల్ కుమార్ అవినీతికి అడ్డాగా మార్చుకున్నాడు. పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఐదేళ్లుగా ఆయన గృహంలోనే ఉంటున్నాడు అంటే అవినీతిలో అనిల్ పాత్ర ఏంటో అర్థం అవుతోంది. అనిల్ అవినీతి నిగ్గు తేలే వరకు ఆయన పాస్‌పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవాలి. అనిల్ కుమార్ అవినీతిలో భాగస్వామ్యులైన అనుచరుల ఇళ్లలో సోదాలు చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరొకరు అరెస్ట్
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పరిశపోగు భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 18 మందిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.