టైరు పేలి.. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:54 AM
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. గుడివాడ దాటాక భయంకరమైన గోతుల రోడ్డు కారణంగా టైరు పేలటంతో అదుపు తప్పిన బస్సు పక్కనే వున్న గోతిలో దిగబడటంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఉంగుటూరు, జనవరి 10 : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. గుడివాడ దాటాక భయంకరమైన గోతుల రోడ్డు కారణంగా టైరు పేలటంతో అదుపు తప్పిన బస్సు పక్కనే వున్న గోతిలో దిగబడటంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. భీమవరం నుంచి వయా మానికొండ మీదుగా సమారు 40 మంది ప్రయాణికులతో ఆలా్ట్ర డీలక్స్ బస్సు బుధవారం మధ్యాహ్నం విజయవాడ బయల్దేరింది. మానికొండ సెంటర్ దాటి జడ్పీ హైస్కూల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు టైరు పేలి అదుపు తప్పింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో బస్సు రోడ్డు పక్కనే వున్న పెద్ద గుంతలో దిగబడి పక్కకు ఒరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమాయంలో ఎదురుగా ఏదైనా వాహనం వచ్చివుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. గోతులమయమైన రోడ్డును చూపి ప్రయాణికులు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి తమదైన శైలిలో శపనార్ధాలు పెట్టారు.