Share News

కర్నూలులో వైసీపీ ప్యాలెస్‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:53 PM

అధికారం ఉంటే చాలు.. ఎక్కడి భూములైనా కొట్టేయవచ్చు.

కర్నూలులో వైసీపీ ప్యాలెస్‌

రూ.వంద కోట్లకు పైగా విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం

కుడా, కార్పొరేషన్‌ అనుమతులు లేని అక్రమ నిర్మాణం

ఏడాదైనా పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ యంత్రాంగం

లీజు పేరిట కారుచౌకగా కొట్టేసిన వైనం

అధికారం ఉంటే చాలు.. ఎక్కడి భూములైనా కొట్టేయవచ్చు..ప్రజల సంపదను సొంతం చేసుకోవచ్చు..ఈ సంగతి గత వైసీపీ పాలనలో అడుగడుగునా రుజువైంది. రాజకోటను మించిన రుషికొండ ప్యాలెస్‌ విశాఖలోనే లేదు. మన కర్నూలులో కూడా రైల్వే స్టేషన్‌ ఐదు రోడ్ల కూడలికి వెళితే నిర్మాణంలో ఉన్న రాజప్రాసాదం కనిపిస్తుంది. దీని పేరు వైసీపీ జిల్లా కార్యాలయం. ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ. వంద కోట్లకు మించిన విలువైన స్థలాన్ని వైసీపీ కబ్జా చేసింది. అధికారం ఉంది కాబట్టి రాష్ట్రమంతా సొంత జాగీరుగా ఆ పార్టీ భావించింది. దీనికి ఇదే ఉదాహరణ. ఈ నిర్మాణానికి కుడా లేదా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అప్రూవల్‌ లేదు. నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కేశారు. ఏడాదిగా ఈ అక్రమ నిర్మాణం సాగుతోంది. అధికారులు అటువైపు వెళ్లలేదు. ఈ స్థలాన్ని మేము లీజుకు తీసుకున్నాం.. వైసీపీ అక్రమ నిర్మాణాన్ని ఆపండి.. అంటూ కలెక్టరుకు వంశీ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అప్రూవల్‌ కోసం మంగళవారం దరఖాస్తు వచ్చిందని కుడా అధికారులు పేర్కొన్నారు.

కర్నూలు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం నడిబొడ్డున, వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్‌ రోడ్డు ఐదు రోడ్ల కూడలిలో జలవనరుల శాఖకు చెందిన సర్వే నంబరు 95-2లో 3.40 ఎకరాలు ఉంది. అందులో 1.60 ఎకరాలు ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఆగ్రోస్‌ సంస్థ)కు 1979లో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 661 జారీ చేసింది. రైతుకు శిక్షణ కేంద్రం కోసం ఆగ్రోస్‌కు ఈ స్థలాన్ని కేటాయించారు. 2014-15లో ఆర్‌ఎస్‌ రోడ్డు నుంచి కల్లూరు ఎస్టేట్‌లోని గోదాముకు ఏపీ ఆగ్రోస్‌ సంస్థను మార్చారు. ఆనాటి నుంచి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉంది. ఏపీ ఆగ్రోస్‌ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఖాళీగా ఉన్న ఈ స్థలంపై పలువురు రాజకీయ నాయకులు కన్నేశారు. 2010 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో మా స్థలం తిరిగి మాకే ఇవ్వండని జల వనరుల శాఖ సీఈ కబీర్‌బాషా ఏపీ ఆగ్రోస్‌ సంస్థకు పలుదఫాలుగా లేఖలు రాశారు. రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.

లీజు పేరిట కారుచౌకగా కొట్టేశారు

రైల్వే స్టేషన్‌ ఐదు రోడ్ల కూడలిలో సెంటు స్థలం బహిరంగ మార్కెట్‌లో రూ.50-75 లక్షలకు పైగానే పలుకుతోందని ఓ బిల్డర్‌ పేర్కొన్నారు. ఈ లెక్కన 1.60 ఎకరాల భూమి విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. ఎంతో విలువైన ఈ భూమిపై వైసీపీ ముఖ్య నాయకుల కన్ను పడింది. వైపీసీ కార్యాలయం నిర్మాణం కోసం గుట్టు చప్పుడు కాకుండా జగన్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారం ఉంది.. కనుసైగ చేస్తే అక్రమంగా అయినా సరే పనులు చేసిపెట్టే అధికారులు ఉన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన రూ.కోట్ల విలువైన ఏపీ ఆగ్రోస్‌ సంస్థకు చెందిన ప్రభుత్వ భూమిని ఏడాదికి రూ.1,600 ప్రకారం లీజు చెల్లించేలా 33 ఏళ్లకు వైసీపీ కార్యాలయం కోసం కేటాయిస్తూ 2023 ఫిబ్రవరి 16న ఆనాటి జగన్‌ ప్రభుత్వం జీవో నంబరు-55 జారీ చేసింది. ఈ జీవోను కూడా ఎంతో గోప్యంగా ఉంచారు. ప్రజలు, రైతుల ప్రయోజనాలను విస్మరించి నగర నడిబొడ్డున ఉన్న 1.60 ఎకరాలు ప్రభుత్వ భూమిని లీజు పేరిట కారుచౌకగా వైసీపీ కార్యాలయం కోసం కట్టబెట్టడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణం:

2023 జూలైలో కర్నూలు నగరపాలక సంస్థ, కుడా నుంచి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌, ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించి టౌన్‌ ప్లానింగ్‌ అప్రూవల్‌ వచ్చిన తరువాతే పనులు చేపట్టాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా సువిశాలమైన రెండు అంతస్తులతో రుషికొండ ప్యాలెస్‌ రాజకోట నిర్మాణం చేపట్టారు. ఆఫీసు రూములు, సమావేశం హాల్‌ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో భవన నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఫ్లోరింగ్‌, రంగులు, ఇంటీరియల్‌ డెకరేషన్‌.. చేయాల్సి ఉంది. కలెక్టరు, కార్పొరేషన్‌ కమిషనర్‌, కుడా వైస్‌ చైర్మన్‌.. వంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆ రోడ్డు మీదుగా ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆ రోడ్డు పక్క నుంచి విధులకు వెళ్తుంటారు. వైసీపీ ఆఫీసు వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. టౌన్‌ ప్లానింగ్‌ అప్రూవల్‌ ఉందా..? కనీసం దరఖాస్తయినా చేశారా..? అని కూడా పరిశీలించలేదు. ఈ విషయాన్ని కుడా అధికారుల దృష్టికి తీసుకెళితే ఈ రోజే (మంగళవారం) అప్రూవల్‌ కోసం దరఖాస్తు వచ్చిందని పేర్కొన్నారు.

కలెక్టరుకు ఫిర్యాదు

ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీ ఆగ్రోస్‌ సంస్థ నుంచి 2012లో లీజుకు తీసుకున్నామని ఎస్వీ ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ (కర్నూలు) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (ఎల్‌ఓఐ) షరతులు పాటిస్తూనే ముందస్తు లీజు చెల్లించామని అంటున్నారు. వివిధ కారణాలు వల్ల ప్రాజెక్టు ఆగిపోయిందని, ఆ వివరాలు ఆగ్రో సంస్థకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని అంటున్నారు. తమకు ఇచ్చిన లీజు గడువు ఉండగానే ఆ భూమిని వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించారని, ఇది చట్ట విరుద్ధమని, వైసీపీ కార్యాలయాన్ని తొలగించి తాము చేపట్టే ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన శ్రీనివాస్‌ బందోజి ఈ నెల 6న కలెక్టరు డాక్టర్‌ జి.సృజనకు ఫిర్యాదు చేశారు.

అప్రూవల్‌ కోసం దరఖాస్తు వచ్చింది...

వైసీపీ కార్యాలయం నిర్మాణానికి అప్రూవల్‌ కోరుతూ ఈ రోజే దరఖాస్తు వచ్చిందని, బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని కుడా వైస్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని కర్నూలు కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవ్‌తేజ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా అప్రూవల్‌ కోసం దరఖాస్తు వచ్చిందని, అనుమతులు ఇచ్చాక పనులు చేపడుతారని పేర్కొన్నారు. ఇప్పటికే పనులు నడుస్తున్న నిర్మాణం విషయంలో ఇదేమి వివరణ అని ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు.

Updated Date - Jun 18 , 2024 | 11:53 PM