Tunglam Village : యువ క్రికెటర్ నితీశ్‌కు జేజేలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:44 AM
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్ కాకి నితీశ్‌కుమార్‌రెడ్డి శనివారం సెంచరీ చేయడంతో అతడి స్వస్థలమైన నగర పరిధిలోని తుంగ్లాంలో సంబరాలు అంబరాన్నంటాయి.
విశాఖలోని తుంగ్లాంలో సంబరాలు
అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం), డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్ కాకి నితీశ్‌కుమార్‌రెడ్డి శనివారం సెంచరీ చేయడంతో అతడి స్వస్థలమైన నగర పరిధిలోని తుంగ్లాంలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా మోతలతో గ్రామం మార్మోగిపోయింది. నితీశ్ కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ ప్రజలతో పాటు గాజువాకలోని క్రికెట్ ప్రేమికులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. సాయంత్రం నితీశ్ పెదనాన్న, కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవంలో నితీశ్ నాయనమ్మ అప్పలకొండ కేక్ కట్ చేశారు. నితీశ్ చిన్నాన్న కాకి రామిరెడ్డి, పెద్దమ్మ కాకి శ్రీదేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు. కాలనీలో యువకులు నితీశ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలతో సందడి చేశారు.