విజయ సంబరం
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:52 AM
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా సాగిన వైసీపీ అవినీతి, అరాచక పాలనలో జిల్లాలోని టీడీపీ శ్రేణులు అనేక ఇబ్బందులు పడ్డాయి. అక్రమ కేసులు, దౌర్జన్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సాహాలు
భారీ విజయాలతో ఉరకలేస్తున్న ఉత్సాహం
గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ
జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగితేలుతున్నారు. పార్టీ అభ్యర్థులు భారీ విజయాలు సాధించడంతో వారిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. గెలుపొందిన అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాల వద్ద బుధవారం కోలాహలం కనిపించింది. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో వచ్చి శుభాకాంక్షలతో ముంచెత్తారు. దీంతో బుధవారం ఆయా ఆప్రాంతాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ కూడా జాం అయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
ఒంగోలు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా సాగిన వైసీపీ అవినీతి, అరాచక పాలనలో జిల్లాలోని టీడీపీ శ్రేణులు అనేక ఇబ్బందులు పడ్డాయి. అక్రమ కేసులు, దౌర్జన్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకమంది ఆర్థికంగా కూడా నష్టపోయారు. అన్ని వర్గాల ప్రజలపైనా వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఉన్నా టీడీపీ వారు అధికంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని దించేయాలన్న పట్టుదలతో అందరూ కసిగా పనిచేశారు. జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతుతోపాటు వివిధ వర్గాల ప్రజల్లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత తోడ్పడింది. ఫలితంగా అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలో టీడీపీ భారీ విజయాలు సాధించడం ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో చూస్తే తీవ్ర ప్రతికూల వాతావరణం ఉండే ఒంగోలు పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఆరుచోట్ల టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రెండుచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైనా అక్కడా పోరాడి ఓడామన్న భావన ఉంది. ఇక గెలుపొందిన స్థానాలలో తూర్పు ప్రాంతంలో వేలాది ఓట్ల మెజారిటీలు రావడం పార్టీశ్రేణులను ఉత్సాహపరిచింది.
శుభాకాంక్షలు తెలిపేందుకు పోటెత్తారు
గెలుపొందిన అభ్యర్థులను అభినందించేందుకు వేలాదిగా పార్టీశ్రేణులు బుధవారం వారి వద్దకు తరలివచ్చారు. ఒంగోలులో భారీ మెజారిటీతో గెలుపొందిన దామచర్ల జనార్దన్‌ను అభినందించేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గంతోపాటు పొరుగు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున శ్రేణులు తరలివచ్చాయి. స్థానిక గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం అభిమానులు, నాయకులతో కిటకిటలాడింది. ఎంపీగా గెలుపొందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎస్‌బీవీ స్వామిలు విడివిడిగా ఉదయం అమరావతి వెళ్లి అధినేత చంద్రబాబును కలిసి మధ్యాహ్నానికి తిరిగి వచ్చారు. అనంతరం వారి నివాసాలకు పెద్దఎత్తున పార్టీశ్రేణులు వచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. ఒంగోలు మంగమూరురోడ్డులోని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ నివాసం పార్టీశ్రేణులు, అభిమానులతో రద్దీగా మారింది. నియోజకవర్గంలోని అనేక గ్రామాల వారు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలుపగా రద్దీ అధికం కావడంతో సాయంత్రం చీమకుర్తి వెళ్లి అక్కడి పార్టీ కార్యాలయంలో పార్టీశ్రేణులను బీఎన్ కలిశారు.
కనిగిరిలో తిరునాళ్లను తలపించేలా..
కనిగిరిలో గెలుపొందిన డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నివాసం, పార్టీ కార్యాలయమైన అమరావతి గ్రౌండ్స్ వద్ద తిరునాళ్ల వాతావరణం కనిపించింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి భారీగా శ్రేణులు తరలివచ్చాయి. అలాంటి వాతావరణమే మార్కాపురంలో గెలుపొందిన కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో విజయం సాధించిన అశోక్‌రెడ్డిల నివాసాల వద్ద కనిపించింది. పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు వచ్చి అభినందనలు తెలిపాయి. ఎర్రగొండపాలెం, దర్శిల్లో ఓటమి బాధించినా రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆప్రాంత టీడీపీ శ్రేణులు కొంత ఊరట చెందుతున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాలలో వివిధ పేటల్లో స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీశ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే భారీ ర్యాలీలు, సభల నిర్వహణకు శ్రేణులు సిద్ధమైనా పోలీసు ఆంక్షలతో వాటిని విరమించుకున్నారు.
మాగుంట కార్యాలయంలో కోలాహలం
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 5: ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక రామనగర్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం ఉదయం, సాయంత్రం మాగుంట, తనయుడు రాఘవరెడ్డిలను పెద్ద సంఖ్యలో శ్రేణులు కలిసి అభినందనలు తెలిపారు. ఆయా వర్గాల ప్రజలు బొకేలు, శాలువాలతో సత్కరించారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లోని వేదపండితులు ఇరువురికీ ఆశీర్వచనాలు అందజేశారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు మాగుంటను కలిసి అభినందించారు. కాగా మాగుంట గెలుపునకు పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు రాఘవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబును కలిసిన మాగుంట
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బాబును కలిసి శాలువతో సత్కరించారు. ఈ సంద ర్భంగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి కూడా చంద్ర బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను చంద్రబాబు నివాసంలో మాగుంట కలిసి అభినందనలు తెలిపారు. మాగుంట వెంట ఆయన మరో తనయుడు నిఖిల్‌రెడ్డి కూడా ఉన్నారు.