Share News

Rammohan Naidu : డిజి యాత్రతో విమానయానం సులువు

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:04 AM

ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Rammohan Naidu : డిజి యాత్రతో విమానయానం సులువు

  • మరో 9 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు ప్రారంభం

  • కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు

గోపాలపట్నం (విశాఖపట్నం), భోగాపురం, సెప్టెంబరు 6: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. దేశంలోని మరో తొమ్మిది విమానాశ్రయాల్లో ‘డిజి యాత్ర’ సేవలను శుక్రవారం ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. విమానయానం సులభతరం చేసుకోవడానికి డిజి యాత్ర సేవలు ఙఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలు అందుబాటులోకొచ్చినట్టు తెలిపారు.

ఈ ఏడాది అక్టోబరులో ప్రకాశం బ్యారేజీ వద్ద సీ ప్లేన్‌ ఆపరేషన్‌కు సంబంధించి డెమో నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా హెలీపోర్టులను కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అక్టోబరు 27 నుంచి విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు. విశాఖ విమానాశ్రయం నుంచి కార్గో విమాన సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పి.గణబాబు చేసిన వినతిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఎం.సురేశ్‌ను ఆదేశించినట్టు చెప్పారు.కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. శుక్రవారం ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించారు. 2026 జూన్‌ నాటికే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 40శాతం పనులు పూర్తయ్యాయన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 04:04 AM