Mohan Bhagwat: దుర్గమ్మను దర్శించుకొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 14 , 2024 | 09:24 AM
విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కొలువు తిరిన దుర్గమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ, డిసెంబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమ్మ వారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం అమ్మ వారి ఆలయానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేరుకోగానే.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయం ఈవో కేఎస్ రామారావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో... దుర్గమ్మకు మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటం, లడ్డుప్రసాదంతోపాటు శేష వస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు అందజేశారు.
అనంతరం దేవాలయం కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. డిసెంబర్ 21వ తేదీ నుంచి భవానీ భక్తులు మాల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారన్నారు. ఈ ఏడాది సుమారు ఐదు లక్షల పైచిలుక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఆమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు.
కనకదుర్గ నగర్‌లో మూడు హోమగుండాలను ఏర్పాటు చేసి.. ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన వచ్చే భావానీల కోసం.. హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారన్నారు. ఈ రోజు.. అంటే శనివారం సాయంత్రం కలిశజ్యోతిల మహోత్సవము రామకోటి నుండి ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఇంద్రకీలాద్రికి భవానీలు ఎంత మంది వచ్చారు.. రోజుకి ఎంత మంది వస్తున్నారనేది ఈ యాప్ ద్వారా తెలుస్తుందని మంత్రి ఆనం తెలిపారు. అయితే ఈ యాప్ ద్వారా భవానీలు ఎప్పుడు.. ఇంద్రకీలాద్రికి వస్తారనేది.. ముందుగానే సమయాన్ని నమోదు చేసుకోనే సౌలభ్యం సైతం ఉందన్నారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా భవానీలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలయానికి నిధులను సమకూర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో సమావేశం జరిగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు.
For AndhraPradesh News And Telugu News