AP Politics: నెల్లూరు లోక్‌సభకు మళ్లీ ఆదాల?.. కారణం ఇదేనా?
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:52 AM
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్థానంలో నెల్లూరు లోక్‌సభ స్థానానికి బలమైన అభ్యర్థిని దింపాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.

వేమిరెడ్డి స్థానంలో ఇన్‌చార్జిగా నియమించాలని జగన్ యోచన
4 రోజుల్లో కొత్త ఇన్‌చార్జిని పెడతామన్న సీఎం
మంగళగిరి అసెంబ్లీ ఇన్‌చార్జి మార్పు?..
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్థానంలో నెల్లూరు లోక్‌సభ స్థానానికి బలమైన అభ్యర్థిని దింపాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే అంగబలం.. అర్థ బలం కలిగిన గట్టి నేత ఎవరూ దొరకడం లేదని.. దీంతో నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్న సిటింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డినే తిరిగి ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆదాల అంగీకరించలేదని సమాచారం. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా దూరంగా ఉండడం.. సోమవారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో.. నెల్లూరుకు కొత్త ఇన్‌చార్జిని నియమించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఆదాలనే మళ్లీ నెల్లూరు లోక్‌సభకు పంపితే బావుంటుందన్న అభిప్రాయానికి వచ్చారని.. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆయన్ను పిలిపించారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన్ను జగన్ ఆప్యాయంగా పలుకరించారు. చంద్రబాబుతో వేమిరెడ్డి సమావేశంపై చర్చించారు. వేమిరెడ్డి స్థానంలో కొత్త లోక్‌సభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నాలుగు రోజుల్లో పూర్తిచేయాల్సి ఉందని ఆదాలతో జగన్ చెప్పారు. అయితే ఆయన అంతరంగాన్ని పసిగట్టిన ఎంపీ.. తాను నెల్లూరు రూరల్‌కే పోటీ చేస్తానని.. లోక్‌సభకు పోటీచేయనని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును కలవలేదని.. పార్టీని వీడడం లేదని.. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచే రిటైరవుతానని తేల్చిచెప్పారు. జగన్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
మంగళగిరిలో ‘గంజి’ పాట్లు
మంగళగిరి అసెంబ్లీ ఇన్‌చార్జిగా చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించామని సీఎం జగన్ ఘనంగా చెప్పుకొన్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గట్టి వ్యతిరేకిస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూడా చిరంజీవి అభ్యర్థిత్వాన్ని అంగీకరించడంలేదు. కమల అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థిస్తున్నారు. దీంతో జగన్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. కాగా, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పంచాయితీ మరోసారి సీఎంవోకు వచ్చింది. మరోవైపు సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం కలిశారు. చీరాల ఇన్‌చార్జిగా తననే నియమించాలని కోరారు. రేపల్లె సీటును ఆశిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కూడా సీఎంవోకు వచ్చారు. మళ్లీ కనిగిరి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన కోరారు.