Share News

వైసీపీకి వ్యతిరేకం.. కూటమికే అనుకూలం

ABN , Publish Date - May 18 , 2024 | 12:03 AM

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమైంది. ఐదేళ్లలో జగన్‌ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి కనిపించింది. హామీల అమలు కోసం, సమస్యలపై పోరాడితే.. కేసులు, దౌర్జన్యాలు, అరెస్టులు, భౌతిక దాడులతో జిల్లావాసులు ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొన్నారు.

వైసీపీకి వ్యతిరేకం.. కూటమికే అనుకూలం

- రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత

- పోలింగ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ నుంచి... నిరుద్యోగ యువత ఓట్ల వరకూ ఏకపక్షంగానే..

- విశ్లేషణలన్నీ టీడీపీ-జనసేన-బీజేపీ మెజార్టీ పైనే..

- విజయంపై కూటమి నేతల ధీమా

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమైంది. ఐదేళ్లలో జగన్‌ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి కనిపించింది. హామీల అమలు కోసం, సమస్యలపై పోరాడితే.. కేసులు, దౌర్జన్యాలు, అరెస్టులు, భౌతిక దాడులతో జిల్లావాసులు ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టక.. ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడ్డారు. ఇంకో వైపు భూ దందాలు, కబ్జాలు, ఇసుక అక్రమాలతో విసిగి పోయారు. అందుకే ఓటు ద్వారా జగన్‌ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ నాడు వైసీపీకి వ్యతిరేకంగా.. కూటమికి అనుకూలంగా ఓటేశారని.. విశ్లేషణలు చెబుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ తోపాటు నిరుద్యోగ యువత, అర్బన్‌ ఓట్లన్నీ టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికే పడ్డాయని వివిధ సర్వేల ద్వారా తెలుస్తోంది. దీంతో విజయావకాశాలపై కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జిల్లాలో హామీలు కురిపించారు. ఒక్కచాన్స్‌ ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తామని నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలేవీ సక్రమంగా నెర వేర్చలేదు. కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. పాతవాటిని కొనసాగించలేదు. గతంలో నిరుపేదలకు రూ.5 కే భోజనం అందించే అన్నక్యాంటీన్లను ఎత్తేశారు. టీడీపీ హయాంలో రూపకల్పన చేసిన ప్రాజెక్టులను పక్కన పెట్టే శారు. ఉద్దానం ప్రజలకు అవసరమైన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఆస్పత్రి విషయంలో వైసీపీ సర్కారు ముందుకెళ్లినా.. ఇది టీడీపీ హయాంలోనే బీజం పడింది. అలాగే శ్రీకాకుళంలో కలెక్టరేట్‌ను, కేఆర్‌ స్టేడియాన్ని ఇప్పటికీ పూర్తిచేయలేకపోయారు. వంశధార నాగావళి నదుల అనుసంధానం ఉత్తిమాటగా మిగిలింది. వంశధార ఫేజ్‌-2 పనులకూ కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. సాగునీటి కాలువల మరమ్మతులకు పైసా విదల్చలేదు. కొత్తగా రోడ్లు నిర్మించలేదు.. పాతరోడ్లకు మరమ్మతులు చేయలేదు. ‘నాడు-నేడు’ అని పాఠశాలలను కొన్ని బాగుచేసి.. విలీనం పేరుతో అత్యధిక బడులను వృథాగా వదిలేశారు. ఇంటివద్దకే రేషన్‌ అని చెప్పి.. ఆ వాహనం కోసం కార్డుదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి కల్పించారు. నిత్యావసరాల కింద బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే విక్రయిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు విలువైన ప్రభు త్వ స్థలాలు కబ్జాకు గురిచేశారు. శ్రీకాకుళం నుంచి కొత్తరోడ్డుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఎడమవైపున నాగావళి నది గట్టుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలానికి రికార్డుల్లో మార్పుచేసి కోట్లరూపాయలను వైసీపీ కీలక ప్రజాప్రతినిధి అండదండతో కాజేశారు. అన్ని నియోజకవర్గాల్లో అక్రమాలు కోకొల్లలుగా జరిగాయి. ఇసుకను నిర్మాణదారులకు చేరకుండా.. రెండేళ్లు ఇబ్బందులకు గురిచేశారు. ఇక్కడి ఇసుకను విశాఖకు దర్జాగా తరలిస్తూ నాయకులు కోటీశ్వరులయ్యారు. సమస్యలు, హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులతో భయపెట్టారు. ఉద్యోగులు సైతం రోడ్డెక్కారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. ఎన్డీయే కూటమితోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి.. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా అధికశాతం మంది ఓటేశారని తెలుస్తోంది.

- ఒకటీ రెండు నియోజకవర్గాలపై వైసీపీ ఆశలు..

జిల్లాలో శ్రీకాకుళం లోక్‌సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీగా రామ్మోహన్‌నాయుడు ఈసారి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కనీసం బొటాబొటీగానైనా గెలుస్తామని.. ఎంపీ సీటు కైవసం చేసుకుంటామని చెప్పుకోలేకపోతున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటీ రెండు చోట్ల మాత్రమే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల సమయంలో పోల్‌మేనేజ్‌మెంట్‌ అంటూ.. వైసీపీ నాయకులకు అందిన డబ్బులను కొంతమేర కత్తిరించి పంపిణీ చేశారని సమాచారం. సీనియర్‌ మంత్రి సైతం.. వార్డుల్లో డబ్బుల పంపిణీ విషయంలో అత్యంత తక్కువ మొత్తాన్ని సారథులకు ఇచ్చినట్లు తెలిసింది. ఇటువంటి కారణాలతోనూ ఉన్న కాస్తంత బలాన్ని కూడా ఆపార్టీ నాయకులు వదులుకున్నారు. టీడీపీకి బీజేపీ, జనసేన ఓట్లు కూడా తోడవడంతో.. ఈసారి కూటమికి మెజార్టీతో బాగానే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- ప్రజల్లోకి బలంగా వెళ్లిన ‘సూపర్‌ సిక్స్‌’...

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈసారి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో రూపొందించారు. సూపర్‌ సిక్స్‌ పేరిట పింఛన్‌ రూ. 4వేలకు పెంపు, తల్లికి వందనం పేరిట పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఏటా రూ.15వేలు చొప్పున, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండెర్లు, మహిళ లకు నెలకు రూ.1500 పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్‌, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షలు వరకు వడ్డీలేని రుణం, నిరుద్యోగ భృతి, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, పూర్‌ టూ రిచ్‌.. ఇలా ఎన్నో కార్యక్రమాలకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలసి షణ్ముఖవ్యూహంగా కొత్తపథకాలను అమలుచేస్తామని ప్రజల కు భరోసా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో మహిళా ఓటర్లు, యువత, వృద్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గాలవారీగా విడిపోయి నా.. అర్బన్‌ ప్రజలు టీడీపీకే మొగ్గుచూపారని తెలుస్తోంది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు.. చంద్రబాబు అరెస్ట్‌ వంటి పరిణామాలతో వైసీపీ దిగజారగా.. టీడీపీకి మరింత సానుభూతి పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 18 , 2024 | 12:03 AM