TDP : మీ వైఖరి మార్చుకోండి
ABN , Publish Date - Oct 06 , 2024 | 02:49 AM
వైఖ రి మార్చుకోకపోతే నష్టపోతారని, పార్టీ నాయకులతో తరచూ వివాదాలకు దిగడం శ్రేయస్కరం కాదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు హెచ్చరించారు.
వంద రోజుల్లోనే ఫిర్యాదులా?
మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదు
పార్టీ నేతలతో వివాదాలు వద్దు
కొలికపూడికి టీడీపీ పెద్దల క్లాస్
తప్పులు జరగవని ఎమ్మెల్యే హామీ
నేడు తిరువూరులో పార్టీ శ్రేణులతో భేటీ
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వైఖ రి మార్చుకోకపోతే నష్టపోతారని, పార్టీ నాయకులతో తరచూ వివాదాలకు దిగడం శ్రేయస్కరం కాదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు హెచ్చరించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన్ను పిలిపించి క్లాస్ తీసుకొన్నారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కృష్ణా జిల్లా పార్టీ ఇన్‌చార్జి మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. ‘రాజకీయాల్లోకి కొత్త తరాన్ని తేవాలని పార్టీ అధినేత చంద్రబాబు మీది ఈ జిల్లా కాకపోయినా పిలిచి తిరువూరు టికెట్ ఇచ్చారు. అక్కడ పార్టీ శ్రేణులంతా మీ కోసం పనిచేసి గెలిపించాయి. వంద రోజుల్లోనే వందల మంది పార్టీ నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మీ మీద ఫిర్యాదులు చేసే పరిస్థితి వస్తే ఎలా? చంద్రబాబు పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింప చేస్తుంటే మీరు బుల్‌డోజర్లతో దానిని కూలగొట్టుకొంటూ వస్తున్నారు.
మీ మీద వచ్చినన్ని వివాదాలు రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ లేవు. ప్రజలు మిమ్మల్ని గెలిపించిం ది తగాదాలు పెట్టుకోమనా లేక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనా? మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదు. మీ వైఖరి మార్చుకోండి’ అని పార్టీ నేతలు హెచ్చరించారు. తాను తప్పు చేయలేదని, తన ము క్కుసూటి తనాన్ని అపార్థం చేసుకొంటున్నారని కొలికపూడి వివరణ ఇచ్చారు. కాని దానిని పార్టీ నేతలు అంగీకరించలేదు. అక్కడ ఏం జరిగిందో సమాచారం సేకరించిన తర్వాతే తా ము మాట్లాడుతున్నామన్నారు.
‘మీ వ్యవహార శైలితోనే సమస్యలు వస్తున్నాయి’ అని చెప్పా రు. విజయవాడ ఎంపీ అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తి అని, ఆయనతో కూడా తగాదా పడితే ఎమ్మెల్యేను తాము ఎలా సమర్థించగలమని ఒక నేత ప్రశ్నించారు. తన వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చూసుకొంటానని కొలికపూడి చెప్పారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదన్నారు. తిరువూరులో పార్టీ శ్రేణులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామని, అందరినీ కలుపుకొనిపోయే వైఖరితో వ్యవహరించాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. నలుగురైదుగురు ముఖ్య నేతల తో నియోజకవర్గ కమిటీని వేస్తామని, వివాదాలు సర్దుకొనేవరకూ ఆ కమిటీతో సమన్వ యం చేసుకొని పనిచేయాలని వారు ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం.
కూర్చుని మాట్లాడుకుంటాం
రాజకీయ పార్టీ అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయని, కూర్చుని మాట్లాడుకు ని వాటిని పరిష్కరించుకుంటామని విజయవా డ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కొలికపూడితో మాట్లాడిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయే ముందు మీడి యా ప్రతినిధులతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు. చిన్న చిన్న సమస్యల వల్ల పార్టీకి, చంద్రబాబుకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని మేమంతా కలిసి నిర్ణయించాం. పార్టీ బలోపేతం, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లేలా చూడటం కోసం తిరువూరులో ఆదివారం ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. దానిలో అన్నీ చర్చించుకుంటాం.
కేడర్‌ను కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం జరుగుతుంది’ అని ఆయన అన్నారు. కొలికపూడి మీడియా ప్రతినిధులతో సంక్షిప్తంగా మాట్లాడారు. ‘నా పనితీరు వల్ల కేడర్‌లో కొంత సమన్వయలోపం ఏర్పడిం ది. ఈ విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. నా పనితీరు వల్ల తలెత్తిన సమస్యలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని ఆయన అన్నారు. తిరువూరు సమస్య చిన్నపాటి కుటుంబ సమస్యని, అన్నీ సమసిపోతాయని పార్టీ జిల్లా సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.