Share News

టీడీపీ కార్యాలయంపై దాడి తప్పు కాదట!

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:32 AM

జగన్‌ హయాంలో తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ మూకలు పట్టపగలు చేసిన దాడిని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అడ్డగోలుగా సమర్థించారు.

టీడీపీ కార్యాలయంపై దాడి తప్పు కాదట!

సజ్జల అడ్డగోలు సమర్థన

పట్టాభి తిట్లు విన్నాక రక్తం మరిగింది

టీడీపీ ఆఫీస్‌పై మా వాళ్లు దాడి చేశారు

ఆ రోజు నేను లేను.. బద్వేలులో ఉన్నా

సెల్‌ఫోన్‌ ఇవ్వను.. ఇది అప్పటిది కాదు

పోలీసు విచారణలో సజ్జల జవాబులు

గంటన్నరపాటు విచారణ.. 38 ప్రశ్నలు

తెలియదు.. గుర్తులేదంటూ సమాధానాలు

నాటి సుద్దులేవి సజ్జల?

అమరావతి/మంగళగిరి సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ మూకలు పట్టపగలు చేసిన దాడిని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అడ్డగోలుగా సమర్థించారు. ‘అది తప్పని నేను అనను’ అని పోలీసు విచారణలోనే చెప్పినట్లు సమాచారం. ‘‘ఆ రోజు జగన్‌ను తిట్టడంతో రక్తం మరిగింది.. ఆ ఉద్రేకంలోనే మా వాళ్లు దాడి చేశారు. అది తప్పని నేను అనలేను. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు నేను ఇక్కడ లేను’’ అని సజ్జల మంగళగిరి పోలీసుల విచారణలో వెల్లడించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు మంగళగిరి పోలీసుల ముందు విచారణకు సజ్జల హాజరయ్యారు. సాయంత్రం 5.15వరకూ, అంటే 1.45గంటల పాటు పోలీసుల ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసులు సజ్జలను మాత్రమే దర్యాప్తు అధికారి వద్దకు అనుమతించారు. 2021 అక్టోబరు 19న టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మంగళగిరి పోలీసులు, పలు కీలక విషయాలను రాబట్టారు. మొత్తం దాడికి కుట్ర తాడేపల్లిలో జరిగిందని, మార్గదర్శకుడు సజ్జల రామకృష్ణా రెడ్డేనని ఆధారాలు సేకరించారు. 120వ నిందితుడిగా పేరు చేర్చి విచారణకు సజ్జలను పిలిచారు. నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ, దర్యాప్తు అధికారి వై.శ్రీనివాసరావు.. ఆయనను విచారించారు. మొత్తం 38ప్రశ్నలు సంధించగా, అందులో ఎక్కువ ప్రశ్నలకు ‘నాకు తెలీదు.. నేను ఇక్కడ లేను.. నాకెలాంటి సంబంధం లేదు’ అనే జవాబులు ఇచ్చారు. మరికొన్నింటికి నిర్లక్ష్యంగా బదులిచ్చారు.


విచారణకు సహకరించలేదు: దర్యాప్తు అధికారి

సజ్జల విచారణకు ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి అయిన సీఐ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కువ ప్రశ్నలకు.. తనకు తెలియదు, సంబంధం లేదు అని మాత్రమే చెప్పారన్నారు. సీసీ ఫుటేజీలు, గతంలో అరెస్టయిన నిందితుల వాంగ్మూలం, సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ప్రశ్నించినా.. సజ్జల తోసిపుచ్చారని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసేందుకు నిరాకరించారని చెప్పారు. మరికొద్ది రోజుల్లో కేసును సీఐడీకి బదిలీ చేయనున్నామని వెల్లడించారు.

పొన్నవోలు ఓవరాక్షన్‌

సజ్జలతో తనను కూడా లోనికి అనుమతించాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంగళగిరి రూరల్‌ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌కు వేలు చూపించి మరీ బెదిరించారు. ‘మేం అధికారంలోకి వచ్చాక మీ అంతు తేలుస్తాం’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

నాటి సుద్దులేవి సజ్జల?

‘‘దర్యాప్తు సంస్థలు ఒక వ్యక్తిమీద కచ్చితమైన ఆధారాలున్నప్పుడు కచ్చితంగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సహజం. ఇందులో రాజకీయ దురుద్దేశాలున్నాయంటూ ప్రచారం చేయడం సరికాదు’’.... స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో నాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ అరెస్టును సమర్థిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలిలి. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తాను ఇప్పుడు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేసరికి ఆ సుద్దులన్నీ తారుమారైపోయాయి. గురువారం విచారణ అనంతరం ఆయన ధీనికి భిన్నంగా మీడియా వద్ద మాట్లాడారు. ‘‘ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది’’ అన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 04:32 AM