CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..
ABN , Publish Date - May 05 , 2024 | 07:20 AM
అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) బూడి ముత్యాల నాయుడు (Budi Mutyala Naidu), వైసీపీ (YCP) దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy)కి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. ఈ సందర్భంగా ఆయన అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో రౌడీ మూకల పని పడతామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అతని మొదటి భార్య సొంత తమ్ముడైన బీజేపీ కార్యకర్త గంగాధర్‌పై దౌర్జన్యం చేశారని, డిప్యూటీ సీఎం గంగాధర్‌ని కొట్టడమే కాకుండా, అతని ఇంటిని ధ్వంసం చేయించారని, ఈ విషయాన్ని దేవరపల్లి ఎస్ఐ నేరుగా ధ్రువీకరించారని తెలిపారు.
జరిగిన అన్యాయంపై మూడు గంటలపాటు శాంతియుతంగా ధర్నా చేసిన పోలీసుల స్పందన కరువైందని సీఎం రామేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన ఏ ఒక్క కార్యకర్తపై దాడి జరిగిన తక్షణమే స్పందిస్తానన్నారు. మాడుగులలో మూడు ముత్యాల నాయుడు కుమార్తె, ఎంపీగా ముత్యాల నాయుడుకి డిపాజిట్లు దక్కవని అన్నారు. దేవరాపల్లిలో రేపు 20,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సందర్భంగా 5వేల మంది వైసీపీ నుంచి కూటమిలోకి చేరుతున్నారని రమేష్ తెలిపారు. ఇవన్నీ తట్టుకోలేక డిప్యూటీ సీఎం దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. జరిగిన సంఘటనను ఢిల్లీ పెద్దలకు తెలియజేశానని, ఎన్నికల్లో పోటీ చేసే తనకే రక్షణ లేకుంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా?.. ఆంధ్రాలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని, వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదని సీఎం రమేష్ స్పష్టం చేశారు.
కాగా అనకాపల్లి కూటమి అభ్యర్థి, బీజేపీ నేత సీఎం రమేష్‌పై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అనుచరులు దాడికి తెగబడ్డారు. గాయపడిన బీజేపీ నేతను పరామర్శించేందుకు వెళ్తున్నక్రమంలో సీఎం రమేష్‌ను అడ్డగించడంతోపాటు.. ఆయనపై దాడి చేసి.. చొక్కా చింపేశారు. బూడి స్వగ్రామమైన దేవరాపల్లి మండలం తారువలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారనే కారణంతో ఆ పార్టీ నాయకులపై ముత్యాలనాయుడు అనుచరులు దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు ఆయనను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. తమ పార్టీ వారిని ఇంట్లోకి దూరి కొట్టారని రమేష్ బృందం ఆరోపిస్తూ బూడి, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
అసలేం జరిగింది?
తారువలో బూడి బావమరిది(మొదటి భార్య సోదరుడు) గంగాధర్ బీజేపీ నాయకుడుగా ఉన్నారు. ఎన్నికల అధికారుల అనుమతితో శనివారం మధ్యాహ్నం డ్రోన్‌తో బీజేపీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. ఆ సమయానికి గ్రామంలోనే ఉన్న బూడి, ఆయన అనుచరులు తమను చంపడానికి డ్రోన్‌తో రెక్కీ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గంగాధర్, డ్రోన్‌ను ఆపరేట్ చేస్తున్న కె. అప్పారావు, పాండురంగారావు, సాయికృష్ణలపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న సీఎం రమేష్, ఆయన అనుచరులు, మాడుగుల టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, కిలపర్తి భాస్కరరావుతో కలిసి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. తమ పార్టీ కార్యకర్తపై బూడి హత్యాయత్నం చేశారని, న్యాయం చేయాలంటూ సీఎం రమేష్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగాధర్‌ను పరామర్శించేందుకు తారువ గ్రామానికి బయలుదేరారు. గ్రామంలో వైసీపీ నాయకులు రమేష్ వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. కొందరు వాహనం అద్దం పగులగొట్టారు. ఇరువర్గాల తోపులాటలో వైసీపీ కార్యకర్తలు.. సీఎం రమేష్ చొక్కా చింపేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రమేష్‌ను స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ వాహనంపై కూడా వైసీపీ మూకలు దాడికి పాల్పడి జీపు అద్దాన్ని పగులగొట్టాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన వైసీపీ మూకలను పోలీసులు నిలువరించి రమేష్‌ను మళ్లీ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమపై బూడి, ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని రమేష్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ, బీజేపీ మద్దతుదారులు వేర్వేరుగా ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బూడి దౌర్జన్యాలను సాగనివ్వను: సీఎం రమేష్
మంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలు, ఆగడాలను సాగనివ్వబోనని సీఎం రమేష్ అన్నారు. దేవరాపల్లి పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తపై మంత్రి బూడి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. పోలీసులను రెచ్చగొట్టే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కార్యకర్తకు న్యాయం చేయాలని వస్తే తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని సీఎం రమేశ్ ప్రశ్నించారు. డీఎస్పీ సాక్షిగా తన వాహనానికి అడ్డంగా బెంచీ వేసుకొని కూర్చుని బూడి ముత్యాలనాయుడు అడ్డుకున్నారని తెలిపారు. బూడి రెచ్చిపోయినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News