AP Politics: సీఎం సీటును ఆక్రమించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
ABN , Publish Date - Feb 14 , 2024 | 10:01 PM
సీఎం పదవి రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇది అసలు వర్తించదు అనేలా వారి చర్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసి ఉండాలి.
అమరావతి: సీఎం పదవి రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇది అసలు వర్తించదు అనేలా వారి చర్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసి ఉండాలి. వైసీపీ నేతలు కావాలంటే రాజ్యాంగాన్ని కూడా మారుస్తారనేలా వారి ప్రవర్తన ఉంటుంది. బుధవారం జరిగిన ఓ సమావేశంలో సీఎం జగన్ కుర్చీని మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath) ఆక్రమించాడు. అసలే విశాఖపట్నంలో అన్నింటిని ఆక్రమించారని ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ ఆయన ఇవేమి పట్టనట్లుగా సీఎం జగన్ రెడ్డి సీటును కూడా ఆక్రమించారు.
ఈ విషయానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) ఎక్స్(ట్విట్టర్) వేదికగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై సెటైర్లు గుప్పించారు. ‘‘పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు... పోటీకి సీటు ఇవ్వలేదని... సెక్రటేరియట్‌కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లోనే కూర్చున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం చైర్ కాదు...అదోక హోదా! వీళ్లకు అర్థం కాదు.... వీళ్ల పోకడులకు అర్థం లేదు’’ అని మంత్రి అమర్నాథ్‌కు సంబంధించిన ఫొటోలను ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు పలు పరిశ్రమలకు వర్చ్యువల్‌గా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శంకుస్థాపన చేయాలి.. కానీ సీఎం రాకపోవడంతో ఆయన స్థానంలో పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.