Share News

సింహాచలం దేవస్థానాన్ని కలెక్టర్‌ చేతిలో పెడితే ఎలా!?

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:04 AM

సింహాచలేశుని చందనోత్సవం ఏర్పాట్లు, గత ఏడాది ఉత్సవ నిర్వహణలో వైఫల్యం, దానికి బాధ్యులు ఎవరు?...అనే అంశాలపై దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తాజాగా ఆలయ ఈఓకు ఓ లేఖ రాశారు.

సింహాచలం దేవస్థానాన్ని కలెక్టర్‌ చేతిలో పెడితే ఎలా!?

గత ఏడాది ఉత్సవ నిర్వహణలో వైఫల్యానికి బాధ్యులు ఎవరు

జాయింట్‌ కలెక్టర్‌ విచారణ నివేదిక ఏమైంది

అసలు తప్పు ఎవరిదో చెప్పరా?, ఏమిటీ వైఖరి..?

ఏడాదైనా బాధ్యులపై చర్యలు తీసుకోరా?

ఇలాగైతే దేవస్థానానికి చెడ్డపేరు రాదా??

దేవస్థానం స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నారా...

ఏ కార్యక్రమం నిర్వహించినా

కనీసం ధర్మకర్తకు సమాచారం ఇవ్వడం లేదు

ఈవోకు అనువంశిక ధర్మకర్త,

ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు లేఖ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలేశుని చందనోత్సవం ఏర్పాట్లు, గత ఏడాది ఉత్సవ నిర్వహణలో వైఫల్యం, దానికి బాధ్యులు ఎవరు?...అనే అంశాలపై దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తాజాగా ఆలయ ఈఓకు ఓ లేఖ రాశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించి, ప్రశ్నించారు. దేవస్థానం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దాని ప్రత్యేకతను అధికారులు కాపాడాలని కోరారు. ప్రతి అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళుతున్నామని చెబుతున్నారని, ఆయన ‘ఓకే’ అంటే అమలు చేస్తామనే విధంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్‌కు దేవస్థానంతో సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

  • - గత ఏడాది చందనోత్సవం చాలా ఘోరంగా జరిగిందని, నిర్వహణలో అధికారులు విఫలమయ్యారని, దానిపై జాయింట్‌ కలెక్టర్‌ విచారణ జరిపి దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నివేదిక పంపించారని, అది ఇంతవరకూ ఎందుకు తెప్పించలేదని ఈఓను ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే దేవస్థానానికి చెడ్డపేరు రాదా?...అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని, వాటిని తక్షణమే సవరించుకోకపోతే ఎలా?...అని ప్రశ్నించారు. వారు నివేదిక ఇచ్చినప్పుడే చేస్తామని ఎన్ని రోజులు కాలయాపన చేస్తారో చెప్పాలని కోరారు. గత ఏడాది తప్పులు చేసిన వారు మళ్లీ ఇప్పుడు అవే తప్పులు చేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలన్నారు. తక్షణమే నివేదిక తెప్పించి, బాధ్యులపై ఉత్సవంలోగానే చర్యలు తీసుకోవాలని పరోక్షంగా సూచించారు.

  • - ఈ ఏడాది మే 10వ తేదీన నిర్వహించాల్సిన చందనోత్సవానికి సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి, దాని తీర్మానాన్ని కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపామని ఈఓ కార్యాలయం నుంచి తనకు లేఖ వచ్చిందని, ఏ చట్టం ప్రకారం కలెక్టర్‌కు పంపించారని అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. ఆయన ఒప్పుకుంటేనే చర్యలు తీసుకోవాలనే నిబంధన ఎక్కడుందని ఆయన నిలదీశారు. దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి ఉందని, దానిని తీసుకువెళ్లి కలెక్టర్‌ చేతిలో ఎలా పెడతారన్నారు. కలెక్టర్‌ సమయానుకూలంగా మంచి సూచనలు చేస్తే తీసుకోవడంలో తప్పు లేదని, కానీ ఆయన చెప్పేంత వరకు పనులు చేపట్టకుండా కూర్చొంటారా?, ఈలోగా పనులు చేయాల్సిన బాధ్యత మనకు లేదా?...అని ఆయన అడిగారు.

ఏ విషయమన్నా చెబుతున్నారా?

గత ఏడాది చందనోత్సవం వైఫల్యం సమీక్ష నుంచి ఇప్పటివరకు పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. దేవస్థానానికి కమిటీ వేసినా, వేరే ఏ కార్యక్రమం చేసినా ధర్మకర్తకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కలెక్టర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం గురించి చెప్పలేదని, అందులో తీసుకున్న నిర్ణయాలు కూడా తనకు తెలియజేయలేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే...శ్రీవరహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వయం ప్రతిపత్తిని, కీర్తిని కావాలనే దెబ్బతీస్తున్నట్టుగా ఉందని, అలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 02:04 AM