Share News

అంచనాలు తగ్గాయా?

ABN , Publish Date - May 31 , 2024 | 12:24 AM

ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల పరిధిలో పోలింగ్‌ ముందు వున్న బెట్టింగుల జోరు.. ఆ తర్వాత మారిపోయింది. అప్పటి వరకు ఉన్న అనుకూలత, వ్యతిరేఖతలను బేరీజు వేసుకుని గెలుపు మాదేనంటూ వైసీపీ శ్రేణులు ధీమాపోయారు. కాని, కౌంటింగ్‌ దగ్గర పడే కొద్దీ అటు ఎన్నికల బెట్టింగ్‌ల్లోనూ, ఇటు అభ్యర్థుల అంచనాల్లోనూ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అంచనాలు  తగ్గాయా?

కౌంటింగ్‌కు ముందే కాడె పడేసిన వైసీపీ కార్యకర్తలు

ఏకపక్ష విజయంపై పందేలకు కూటమి తరపున సిద్ధం

ఒకటికి, నాలుగు రెట్లు ఇస్తామంటూ ముందుకు..

రెండు ఎంపీ స్థానాలు కూటమికేనంటూ సంకేతాలు

పోలింగ్‌ ముందు, ఆ తర్వాత మారిన లెక్కలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల పరిధిలో పోలింగ్‌ ముందు వున్న బెట్టింగుల జోరు.. ఆ తర్వాత మారిపోయింది. అప్పటి వరకు ఉన్న అనుకూలత, వ్యతిరేఖతలను బేరీజు వేసుకుని గెలుపు మాదేనంటూ వైసీపీ శ్రేణులు ధీమాపోయారు. కాని, కౌంటింగ్‌ దగ్గర పడే కొద్దీ అటు ఎన్నికల బెట్టింగ్‌ల్లోనూ, ఇటు అభ్యర్థుల అంచనాల్లోనూ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ పెట్టుకున్న ఆశలు ఇప్పటి వరకు సాగిన అంచనాల్లో గల్లంతయ్యాయి. అదే కూటమిలో ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు దక్కించుకుంటామనే ఆశ రెండింతలైంది.

పోల్‌ మేనేజ్‌మెంట్‌లో పైచేయి మాదేనంటూ విర్రవీగారు. డబ్బు పంపకంలోనూ, గ్రామాలకు గ్రామాల్లోనే తమ అనుకూలత రెండింతలు చేసుకున్నామంటూ పైపైకి సంబరాలు. ఇంకాస్త ఒక అడుగు ముందుకు వేసి మహిళా వర్గాలన్ని తమకే సానుకూలంగా స్పందించాయని మైనార్టీలు, ఇంకొన్ని వర్గాలు తమకు మద్దతు ఇచ్చాయని, లెక్క కట్టి మరీ ఏ నియోజకవర్గంలో ఎంతెంత మెజార్టీ వస్తుందో ప్రచారం చేసిన వైసీపీకి ఇప్పుడు ఆ ధీమా కొంత సడలినట్టు కనిపిస్తోంది. పోలింగ్‌ ముందు వరకు ఉన్న సరళి ఆ పార్టీకి లాభప్ర దంగానే సాగిందన్న అంచనాలు ఫలితాలపై కొంత ఊపిరిపోశాయి. గడిచిన రెండు వారాలుగా బూత్‌ స్థాయిలో ఏ తరహా పోలింగ్‌ సరళి సాగింది. అనుకూలత, వ్యతిరేకత శాతం ఎంతనేది పార్టీ కేడర్‌ లెక్క కట్టి... అమ్మో ఇంత జరిగిందా? అంటూ ఇప్పుడు బేలతనం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి క్రికెట్‌ బెట్టింగ్‌ లోనే కాదు, ఎన్నికల బెట్టింగ్‌లోనూ గోదావరి జిల్లాల జనానిది అందెవేసిన చేయి. ఫలితాలు ఊహించడంలో ఏ మాత్రం వెనుకంజ వేయని గుణం. మెజార్టీల విష యంలోనూ జాతకాలు చెప్పి మరీ నిరూపించిన ఘటనలు ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో అప్పట్లో ఫ్యాను గాలే వీస్తుందని బెట్టింగ్‌ రాయుళ్ళు భారీ పందేల కు ముందుకు వస్తే.. దెబ్బతో మీ జేబులు అన్ని గోవిందా అంటూ కొందరు ఎద్దేవా చేశారు. ఇంకొందరు ఆట పట్టించారు. మరికొందరు భూములకు భవనాలకు పోటీ కి సిద్ధమా అంటూ సవాళ్ళు విసిరారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తరచూ వార్తలకెక్కే నియో జకవర్గాలు ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో దెందు లూరు, నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆచంట, ఉండి నియోజకవర్గాలు ముందు వరుసలో ఉన్నాయి.

ఆచంట పితానిదా ? చెరుకువాడదా ?

ఆచంట నియోజకవర్గంలో కూటమి పక్షాన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ రంగం లో ఉన్నారు. మొదటి నుంచి బీసీ వర్గాల ప్రతినిధిగా ఆయన కొనసాగుతూనే వచ్చారు. గడిచిన ఎన్నికల్లో మార్పులు, చేర్పులు దృష్ట్యా అప్పట్లో గెలుపు సాధించ లేకపోయారు. తాజాగా ఒక వ్యూహం ప్రకారం పట్టు సాధించేందుకు శతవిఽధాలా ప్రయత్నించారు. ఆచంటలో గెలుపు పితానిదా, వైసీపీ అభ్యర్థి రంగనాథరాజుదా అనే సందిగ్దత ఒక దశలో పోలింగ్‌కు ముందే చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇక్కడ పరిణామాలన్ని మిశ్రమంగా ఉన్నాయని, ఇక్కడి సామాజిక వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చినవే ఇప్పుడు పితాని వైపు మొగ్గు చూపాయని, స్వల్ప మెజార్టీతో ఆయన గట్టెక్కడం ఖాయమంటూ భారీగా బెట్టింగ్‌లు సాగాయి. పితాని, రంగనాథరాజు ఇద్దరు మాజీ మంత్రులే. రాజకీయ వ్యూహాల్లో గట్టి పట్టు ఉన్నవారే. బీసీ నియోజకవర్గంగా పేరొందిన ఆచంటలో రెండోసారి పాగా వేసేందుకు వైసీపీ పోలింగ్‌కు ముందు అన్ని ఎత్తుగడలు వేసింది. తగ్గట్లుగానే కూటమి పక్షాన పితాని సైతం ఎదురుదాడి కొనసాగించారు. ఇక్కడ ఓట్ల చీలిక మీద ఆధారపడి వైసీపీ పక్షాన పోలింగ్‌, ఆ తర్వాత వారం రోజులు బెట్టింగుల్లో వైసీపీ పక్షాన కొందరు ముందుకు వచ్చారు. అదే క్రమంలో పితాని గెలుపు ఖాయమైం దంటూ లెక్క కట్టిన వారంతా తేల్చి ఆపై అనుకూల బెట్టింగ్‌కు సిద్ధపడినప్పుడు వైసీపీ పక్షాన అందరూ సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ నియోజకవర్గంలో పాగా వేసేదెవరంటూ రెండు రోజులుగా ప్రేరేపిత బెట్టింగ్‌ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా కొందరు బెట్టింగ్‌ కౌంటర్లు తెరిచినట్టు సమాచారం.

చింతమనేనిపై బెట్టింగ్‌ జోరు

దెందులూరులో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌, వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరి మధ్య హోరాహోరీగా సాగగా, ఫలితం ఎవరికి అనుకూలం అనే విషయంలో పోలింగ్‌ ముందు వరకు వైసీపీకి అనుకూలంగానే ఎక్కువ మంది బెట్టింగ్‌లకు దిగారు. ఒకటికి రెండింతల పేరిట బెట్టింగ్‌లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాని, పోలింగ్‌ తదుపరి ఈ నియోజకవర్గం నుంచి ప్రభాకర్‌ స్వల్ప మెజార్టీతోనే గట్టు ఎక్కుతారని, తాజాగా బెట్టింగ్‌లు జోరందుకోగా, సమాంతరంగా వైసీపీ పక్షాన బెట్టింగ్‌ కాసే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. రఘురామ మెజారిటీపై ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు ఎంత మెజార్టీతో విజయం సాధించబోతున్నారంటూ అత్యధికులు బెట్టింగ్‌లకు దిగారు. పోలింగ్‌ నాటి వరకు ఆయన మెజార్టీ 20 నుంచి 30 వేల వరకు ఉంటుందని దీనికి రెట్టింపు పందేలకు కొందరు సవాళ్లు విసిరారు. ఇక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఎన్ని వేల ఓట్లు చీల్చబోతు న్నారు. ఈ చీలిక టీడీపీ అభ్యర్థి రఘురామకు నష్టమా? లేదా? వైసీపీ అభ్యర్థి నరసింహరాజుకు నష్టమా.. అంటూ బెట్టింగ్‌లు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా రఘురామ ఘన విజయం సాధించడం ఖాయమంటూ బెట్టింగ్‌ల జోరు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

మిగతా నియోజకవర్గాల్లో..

కైకలూరులో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ గెలుపు ఖాయమంటూ అత్యధికులు ఒకటికి రెండింతలు పేరిట పోలింగ్‌కు ముందే బెట్టింగ్‌లకు దిగి ఇప్పుడు దాన్ని పతాక స్థాయికి చేర్చారు. కామినేని గెలుపుపై ఒకటికి, నాలుగు రెట్లు సిద్ధం అంటూ సవాల్‌ విసురు తున్నా వైసీపీ అనుకూల వర్గాల నుంచి స్పందన కరువైంది. ఈ నియోజక వర్గంలో పోలింగ్‌ ముందున్న పరిస్థితులు, పోలింగ్‌ తర్వాత బీజేపీ అనుకూల పరిస్థితులే ఉన్నాయని కూటమి పక్షాన నేతలు ఇప్పటికే ఒక ముగింపునకు వచ్చారు. వైసీపీ మాత్రం పోలింగ్‌ రోజు చివరి మూడు గంటలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన మహిళా ఓటర్లు తమకు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారని, తమకు తిరుగులేని ఆధిక్యత లభించడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్‌కుమార్‌ గెలుపుపై ఇప్పటికే ఒకటికి రెండింతలు బెట్టింగ్‌లు పుంజుకోగా, వైసీపీ పక్షాన ఆ స్థాయిలో బెట్టింగ్‌లకు దిగే వారు లేకపోవడం కొత్త పరిణామంగా భావిస్తున్నారు. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి ధర్మరాజు గెలుపు ఖాయమని, మెజార్టీ ఎంత అనే దానిపై ఇప్పుడు పందేలు సాగుతున్నాయి. ఇవి కూడా జనసేనకే పూర్తి అనుకూలంగా ఉండడం, వైసీపీ నుంచి స్పందన లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. పోలవరం నుంచి జనసేన అభ్యర్థి బాలరాజు గెలుపు ఖాయమంటున్న వారి సంఖ్య ఈ మధ్య మరింత పెరిగింది. ఏలూరు నుంచి బడేటి చంటి ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానిపైన నగరంలో లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ళ నాని ఓటమి ఖరారైందంటూ ఎవరైనా బెట్టింగ్‌కు సిద్ధమా అంటూ కూటమి పక్షాన బెట్టింగ్‌ సవాళ్ళు విసురుతున్నా వైసీపీ పక్షాన స్పందించే వారే కరువయ్యారు. తణుకు, పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఏకపక్షంగా ఉందని, ఇప్పటికే ఓటర్లు అత్యధికులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. తణుకులో రాధాకృష్ణ, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు భారీ మెజార్టీతో గెలువబోతున్నా రంటూ బెట్టింగ్‌లు ఒకటి, నాలుగు రెట్లు మీద సాగాయి. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌, నరసాపురంలో నాయకర్‌లు జనసేన అభ్యర్థులుగా భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బెట్టింగ్‌లకు దిగినా వేరెవ్వరూ దీనికి పోటీగా రాలేకపోతున్నారు. నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా ప్రతాప్‌ అప్పారావు గెలుపు ఖాయమంటూ ఏకపక్షంగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కూటమి పక్షాన పుట్టా మహేష్‌యాదవ్‌, నరసాపురం లోక్‌సభ ఎంపీ అభ్యర్థి బీజేపీ పక్షాన భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలుపు ఖాయమన్నట్టు కొందరు మాత్రమే బెట్టింగ్‌లు సాగిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:25 AM