Land Grabbing : వైసీపీ హయాంలో స్వాహా పర్వం
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:45 AM
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.
ఎన్నెన్నో అక్రమాలు
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు. గెడ్డలు పూడ్చివేసి, కొండలు చదును చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహితుడు గోపినాథ్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఎష్యూర్ ఎల్‌ఎల్‌పీ సంస్థ విస్సన్నపేట లేఅవుట్‌లో 55 ఎకరాలు, కృష్ణా జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత పేరుతో 200 ఎకరాల వరకూ కొనుగోలు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 253పీలో వైసీపీ నాయకుడు గుండేపల్లి రాము సుమారు 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్టు ఆరోపణలున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధిలో పూజారి మల్లేశ్వరికి చెందిన ఐదెకరాల భూమిని వైసీపీ నాయకురాలు డి.అనంతకుమారి పేరున రిజిస్ర్టేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి.
కురుపాం నియోజకవర్గంలో మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఐటీడీఏ నిధులతో తన ఇంటి చుట్టూ రక్షణ గోడను నిర్మించుకున్నారు. పాలకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కళావతి సీతంపేట మండలంలో పేదల నుంచి అతిచౌకగా భూమిని కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ప్రభుత్వ నిధులతో బీటీ రహదారిని ఏర్పాటు చేసుకున్నారు.
మదనపల్లె-పుంగనూరు జాతీయ రహదారికి ఆనుకుని బసినికొండ రెవెన్యూ గ్రామంలో వివాదాస్పద భూములను వైసీపీ నేతలు ఆక్రమించారు. కడప, పులివెందులకు చెందిన ముఠా సభ్యులను పిలిపించి దౌర్జన్యంగా సిమెంటు పలకలతో ప్రహరీ ఏర్పాటు చేశారు. రూ.50 కోట్ల విలువ చేసే పదెకరాల భూమిని ఆక్రమించారు.
ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెలో రూ.30 కోట్లు విలువ చేసే 5 ఎకరాలు చర్చి భూమిని మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
మైదుకూరు నియోజకవర్గం నంద్యాలంపేట సర్వే నెంబర్ 506బీ, 507లో 304 ఎకరాల అటవీ శాఖ భూమి ఉంది. వైసీపీ నేత ఆక్రమించి పండ్ల తోటలనే సుమారు 50 ఎకరాల్లో సాగు చేశారు.
బద్వేలులోని సర్వేనెంబర్ 1568, 69, 62లో 19 ఎకరాల భూములను గతంలో దళితులకు ఇచ్చారు. ఇక్కడ ఎకరం ధర రూ.3 కోట్లపైనే ఉంటుంది. వైసీపీ నేత, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కలసపాడు రెవెన్యూ పొలంలో ముగ్గురు వైసీసీ నేతలు 75 ఎకరాలు ఆక్రమించారు.