సెబీ చీఫ్‌పై మా ఆరోపణలు పక్కా నిజం
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:44 AM
హిండెన్‌బర్గ్ రీసెర్చ్-సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌ల వివాదం కొనసాగుతోంది. సెబీలో చేరకముందు భారత్, సింగపూర్ దేశాల్లో ఆమె ఏర్పాటు చేసిన అఘోర అడ్వైజరీ లిమిటెడ్ (ఇండియా), అఘోర పార్ట్‌నర్స్ సింగపూర్ అనే రెండు...
ఆమే తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలి: హిండెన్‌బర్గ్
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్-సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌ల వివాదం కొనసాగుతోంది. సెబీలో చేరకముందు భారత్, సింగపూర్ దేశాల్లో ఆమె ఏర్పాటు చేసిన అఘోర అడ్వైజరీ లిమిటెడ్ (ఇండియా), అఘోర పార్ట్‌నర్స్ సింగపూర్ అనే రెండు కన్సల్టింగ్ సంస్థల ఖాతాదారుల వివరాలు బయటపెట్టి బుచ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని హిండెన్‌బర్గ్ సవాల్ చేసింది. ఈ వివరాలు బయటపెడితే ఆమె నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుందని పేర్కొంది. ఈ రెండు కన్సల్టింగ్ సంస్థల్లో సెబీ చీఫ్‌కు ఇప్పటికీ 99 నుంచి 100 శాతం వాటాలు ఉన్నట్టు తెలిపింది.
వారే ఒప్పుకున్నారు: బుచ్ దంపతులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మారిషస్, బెర్ముడాల్లోని రహస్య ఫండ్స్‌లో తమకు పెట్టుబడులు ఉన్న విషయాన్ని వారే అంగీకరించిన విషయాన్ని హిండెన్‌బర్గ్ గుర్తు చేసింది. ఇవే ఫండ్స్‌లో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకీ అక్రమ పెట్టుబడులు ఉన్నట్టు హిండెన్‌బర్గ్ మరోసారి తెలిపింది.
ఈ ఫండ్స్ ద్వారానే అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో దందా కొనసాగుతోందని ఆరోపించింది. బుచ్ దంపతులు విడుదల చేసిన ప్రకటన మరిన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది. పూర్తి నిజాలు బయట పడాలంటే సెబీ చీఫ్ పూర్తి పారదర్శకంగా ఉండే దర్యాప్తునకు సిద్ధపడాలని సవాల్ చేసింది.
కొత్తగా చెప్పేది ఏమీ లేదు: హిండెన్‌బర్గ్ సంస్థ.. సెబీ చీఫ్ మాధవిపై చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోరు మెదపడం లేదు. మాధవి పురి బుచ్, సెబీ దీనిపై ఇప్పటికే తమ వివరణ ఇచ్చినందున, ఈ విషయంలో కొత్తగా తాము చెప్పాల్సిందేమీ లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ అన్నారు.