RIL : తగ్గిన రిలయన్స్ లాభం
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:53 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) లాభం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్‌ఐఎల్ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో
క్యూ1లో 5 శాతం క్షీణతతో రూ.15,138 కోట్లకు పరిమితం
డీలాపడిన ఓ2సీ వ్యాపారం జూ ఆదాయం రూ.2.36 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) లాభం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్‌ఐఎల్ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.16,011 కోట్ల (ఒక్కో షేరుకు రూ.23.66) లాభంతో పోలిస్తే 5 శాతం తగ్గింది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆర్జించిన రూ.18,951 కోట్ల లాభంతో పోలిస్తే ఏకంగా 20 శాతం క్షీణించింది. ముడిచమురు శుద్ధి వ్యాపార లాభాల మార్జిన్ తగ్గడం, ఇంధన విక్రయ మార్జిన్ల క్షీణతతోపాటు తరుగుదల వ్యయాలు, రుణ వ్యయాల పెరుగుదల కంపెనీ లాభాలకు గండికొట్టింది. టెలికాం, రిటైల్ వ్యాపారాల జోరు కొనసాగడం కంపెనీని ఆదుకుంది. కాగా, ఈ క్యూ1లో రిలయన్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రాబడి రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2.64 లక్షల కోట్ల రెవెన్యూతో పోలిస్తే మాత్రం ఈ ఏప్రిల్-జూన్‌లో భారీగా తగ్గింది.
ఆయిల్ అండ్ గ్యాస్
ఈ ఏప్రిల్-జూన్ కాలానికి ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి వ్యాపార ఆదాయం 33.4 శాతం వృద్ధి చెంది రూ.6,179 కోట్లకు పెరిగింది. స్థూల లాభం 29.8 శాతం పెరుగుదలతో రూ.5,210 కోట్లుగా నమోదైంది. కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి రోజుకు సహజ వాయువు సగటు ఉత్పత్తి 28.7 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు చేరుకుంది.
గత త్రైమాసికంలో కంపెనీ స్థూల లాభం వార్షిక ప్రాతిపదికన మెరుగుపడింది. ఓ2సీ వ్యాపార పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ టెలికాం, రిటైల్‌తో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి వ్యాపారాలు బలమైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదపడింది. కంపెనీ చురుకైన నిర్వహణ, ఆర్థిక పనితీరు విభిన్న వ్యాపారాల బలాన్ని నొక్కి చెబుతుంది.
-ముకేశ్ అంబానీ,
చైర్మన్, ఎండీ,ఆర్‌ఐఎల్
జియో ప్లాట్‌ఫామ్స్
రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపారాలన్నింటినీ ఏకతాటికి చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్ నిర్వహణ ఆదాయం ఈ క్యూ1లో 13 శాతం పెరిగి రూ.29,449 కోట్లకు చేరుకుంది. నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.5,698 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో రిలయన్స్ జియో కస్టమర్లు మరో 80 లక్షల మేర పెరిగి 48.97 కోట్లకు చేరుకున్నారు. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) రూ.181.7గా నమోదైంది. జియో కస్టమర్ల సగటు డేటా వినియోగం నెలకు 30.3 జీబీ లేదా రోజుకు ఒక జీబీకి చేరుకుంది. అంతేకాదు, డేటా వినియోగపరంగా జియో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ డేటా ట్రాఫిక్ 44.1 బిలియన్ జీబీలు, వాయిస్ కాలింగ్ ట్రాఫిక్ 1.42 లక్షల కోట్ల నిమిషాలుగా నమోదైంది.
రిలయన్స్ రిటైల్
గడిచిన త్రైమాసికంలో ఈ విభాగ స్థూల ఆదాయం 8.1 శాతం వార్షిక వృద్ధితో రూ.75,615 కోట్లకు చేరుకోగా.. నికర లాభం 4.63 శాతం పెరుగుదలతో రూ.2,549 కోట్లుగా నమోదైంది. గత మూడు నెలల్లో రిలయన్స్ రిటైల్ 331 కొత్త విక్రయ కేంద్రాలను ప్రారంభించింది. దాంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,918కి చేరుకుంది. కాగా, మూడు నెలల్లో తమ స్టోర్లను 29.6 కోట్ల మంది సందర్శించారని కంపెనీ తెలిపింది.
ఆయిల్ టు కెమికల్స్
గత క్వార్టర్‌లో ఓ2సీ విభాగ ఆదాయం 18 శాతం పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ, స్థూల లాభం మాత్రం 14 శాతం తగ్గి రూ.13,093 కోట్లకు పరిమితమైంది. ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చే విభాగ మార్జిన్లు 30 శాతం క్షీణించడంతో పాటు కెమికల్ వ్యాపారాల మార్జిన్లు కూడా గణనీయంగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమైంది.
మీడియా
గత మూడు నెలల్లో కంపెనీ మీడియా వ్యాపారం రూ.221 నికర నష్టాన్ని చవిచూసింది. ఆదాయం కూడా 3.7 శాతం తగ్గి రూ.3,650 కోట్లకు పరిమితమైంది.