Share News

RBI: కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చు: ఎస్బీఐ నివేదిక

ABN , Publish Date - Feb 05 , 2024 | 03:52 PM

కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చని ఎస్బీఐ మార్కెట్ రీసెర్చ్ అంచనా వేస్తోంది.

RBI: కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పు చేయకపోవచ్చు: ఎస్బీఐ నివేదిక

ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మంగళవారం నుంచీ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల మార్పుపై (Interest rates) స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసారి కూడా ఆర్బీఐ రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని (Status quo) కొనసాగించే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఈ ఆర్థిక సంవత్సరం చివరి సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థితిగతులను ఆర్బీఐ పరిశీలించి తన నిర్ణయాన్ని వెలువరిస్తుంది.


అమెరికాలో జీతాలు, ఉద్యోగితకు సంబంధించి సానుకూల సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ స్థితి కొనసాగించేందుకు మొగ్గు చూపొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో అభిప్రాయపడింది. చివరి సారిగా ఆర్బీఐ గతేడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.25 నుంచి 6.5 శాతానికి పెంచింది. నాటి నుంచీ వడ్డీ రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. మరోవైపు దేశీయంగా కూడా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వడ్డీ రేటు మార్పు విషయంలో ఆర్బీఐపై ఒత్తిడి ఉండకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జూన్ తరువాత ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లపై దృష్టి సారించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది.


అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) కూడా ఇటీవలి సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథ స్థితిలో కొనసాగించేందుకు నిర్ణయించింది. ఆర్థికాభివృద్ధి ఆశాజనకంగా ఉండటంతో వడ్డీ రేట్లలో మార్పు చేయట్లేదని ఫెడరల్ రిజర్వ్ అప్పట్లో తెలిపింది. కరోనా తరువాత ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను 5.25-5.50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 05 , 2024 | 03:57 PM