Hyderabad: ఆన్‌లైన్‌లో నగదు పంపుతానని మోసం.. సర్వర్ సమస్య ఉందంటూ నమ్మబలికి..
ABN , Publish Date - Feb 24 , 2024 | 12:15 PM
బ్యాంకుకు వచ్చిన వ్యక్తి నుంచి నగదు తీసుకుని ఆన్‌లైన్‌లో పంపుతానని ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: బ్యాంకుకు వచ్చిన వ్యక్తి నుంచి నగదు తీసుకుని ఆన్‌లైన్‌లో పంపుతానని ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురాగర్ కాలనీలో నివాసం ఉంటున్న విశాంత్‌రెడ్డి గత నెల 28వ తేదీ ఎల్లారెడ్డిగూడలోని స్టేట్ బ్యాంకుకు వెళ్లాడు. లక్ష రూపాయలు డిపాజిట్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఇంటిపల్లి రామారావు అనే వ్యక్తి తనకు డబ్బిస్తే ఆన్‌లైన్‌లో నగదు పంపుతానని చెప్పాడు. అంతేకాకుండా విశాంత్‌రెడ్డి సమక్షంలోనే ట్రాన్స్‌ఫర్ చేశాడు. తనకు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ విశాంత్‌రెడ్డికి క్రెడిట్ అయినట్లు మెసేజ్ రాలేదు. సర్వర్ సమస్య ఉన్నట్లుంది... సాయంత్రానికి క్రెడిట్ అవుతుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన విశాంత్‌రెడ్డి లక్ష నగదును రామారావుకు ఇచ్చాడు. మరునాడు రామారావు స్వయంగా ఫోన్‌చేసి సర్వర్ సమస్య ఉంది, సాయంత్రానికి క్రెడిట్ అవుతుందని చెప్పాడు. ఐనా తన అకౌంట్‌లో డబ్బు పడకపోవటంతో తను మోసపోయానని గుర్తించి, విశాంత్‌రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.