IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:40 PM
కార్తీక మాసం వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పమాల వేసుకుంటారు. అనంతరం వీరంతా శబరిమలకు పయనమవుతారు. అయితే ఇప్పటికే శబరిమలకు వెళ్లే రైళ్లన్ని రిజర్వేషన్లతో నిండిపోయాయి. భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాటిలో సైతం రిజర్వేషన్లు అయిపోయాయి. అలాంటి వేళ.. ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చింది.
దీపాల పండగ దీపావళితో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ తర్వాత పరమ శివుడికి మహా ప్రీతి పాత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసమంతా నోములు వ్రతాలే. అలాగే భక్తులు అయ్యప్ప మాలను సైతం ధరిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది స్వాములు ప్రతి ఏటా శబరిమలకు పోటెత్తుతారు. అయితే వీరి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజాగా సికింద్రాబాద్ నుంచి శబరిమలకు యాత్ర కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ యాత్ర నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే తాజాగా విడుదల చేసింది.
Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
నవంబర్ 16వ తేదీన సికింద్రాబాద్‌లో ప్రారంభకానున్న ఈ రైలు.. తెలుగు రాష్ట్రాల మీదగా సాగనుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరపతి, చిత్తూరు స్టేషన్లలో అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు ఈ రైలు ఎక్కేందుకు అవకాశం కల్పించింది. శబరిమలలోని అయ్యప్పస్వామి వారి ఆలయంతోపాటు ఎర్నాకుళంలో చోటానిక్కర్ అమ్మవారి ఆలయం మీదగా ఈ యాత్రను ఐఆర్‌సీటీసీ రూపొందించింది. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు కొనసాగుతుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.
Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..
నవంబర్ 16వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాత్రి 7.00 గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణించాలి. మూడో రోజు శబరిమలలో స్వామి వారి దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత నీలక్కళ్ చేరుకుని అక్కడి నుంచి ఎర్నాకుళంలో రాత్రికి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం చోటానిక్కర అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఎర్నాకుళంలో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు రైలు చేరుకుంటుంది.
ప్యాకేజీ ఛార్జీల వివరాలివే..
ఎకానమీ (SL) కేటగిరిలో ఒక్కో టికెట్ ధర రూ. 11,475. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులైతే రూ. 10, 655 చెల్లించాలి.
3 ACలో రూ. 18,790. చిన్నారులకు రూ. 17,700
2 ACలో రూ. 24,215. చిన్నారులకు రూ. 22,910.
ఉదయం టీ, అల్పాహారం. మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బంది అందిస్తారు.
యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుం ఉంటే.. యాత్రికులే స్వయంగా చెల్లించవలసి ఉంటుంది.
పుణ్యక్షేత్రాలకు హాజరయ్యే సమయంలో పురుషులు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఈ రైలు ప్రయాణం గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Read Latest Telangana News And Telugu News