మోదీ సర్కార్ మూడో రాకడ ఖాయం
ABN , Publish Date - May 14 , 2024 | 05:31 AM
భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రక ఎన్నికలలో చాలా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సంపాదించింది. 2024లో ఆ ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్నవారు, కుహనా మేధావులు వాదిస్తున్నారు. వారి వాదనలో...

భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రక ఎన్నికలలో చాలా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సంపాదించింది. 2024లో ఆ ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్నవారు, కుహనా మేధావులు వాదిస్తున్నారు. వారి వాదనలో పసలేదు. ఎందుకంటే 2014 నుంచీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి జనాదరణ పెరుగుతుందే కాని తగ్గడం లేదు. బీజేపీ దినదిన ప్రవర్ధమానమవుతున్న పార్టీయే కాని కాంగ్రెస్‌లా రోజురోజుకూ వెలుగు తగ్గిపోతున్న పార్టీ కాదు. మోదీ పట్ల ప్రజల విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోందని, ఆయనను అభిమానించే వారి సంఖ్య కోట్లలో ఉంటుందని చాలా మందికి ఇంకా అర్థం కావడం లేదు.
ఇవాళ ఉత్తరప్రదేశ్‌నే చూస్తే అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత పటిష్ఠంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో ఒకప్పుడు మహిళలు ఒంటరిగా తిరిగేందుకు భయపడేవారు. ఎక్కడ చూసినా మాఫియా, గూండాగిరీ రాజ్యమేలేది. అభివృద్ధి అనేది ఏ కోశానా కనపడేది కాదు. ఇప్పుడు మోదీ–యోగీ సారథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలవుతున్నాయి. వేల కోట్ల మేరకు సంక్షేమ కార్యక్రమాల నిధులు జనానికి నేరుగా చేరుతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి నూటికి నూరు శాతం మెరుగుపడింది. ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ కారిడార్ నిర్మాణం తదితర చర్యల వల్ల కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక, ధార్మిక మనోభావాల పరిరక్షణ జరిగింది. ఈ పరిస్థితుల్లో కులాల పేరుతో, మైనారిటీల పేరుతో కొన్ని దుష్టశక్తులు ఏకం అయినంత మాత్రాన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ తగ్గుతుందా? గతంలో కంటే అత్యధిక సంఖ్యలో యూపీలో బీజేపీ సీట్లు సాధించడం ఖాయం.
యూపీ మాత్రమే కాదు, డబుల్ ఇంజన్ సర్కార్ అమలులో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం మళ్లీ వీయనుందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మోదీతో చంద్రబాబు–పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో ప్రజల్లో సమధికోత్సాహం నెలకొంది. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం జరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా అనతి కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారు.
బీజేపీ గెలుపునకు ఎన్నో కారణాలు చెప్పవచ్చు. మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ప్రజలు తమ జీవితాలకు, ఆలోచనలకు సన్నిహితంగా ఉన్న పార్టీగా భావిస్తున్నారు. మోదీకి తప్ప మరెవరికి ఓటు వేస్తాం? అన్న ప్రశ్న ప్రతి సామాన్యుడి మనసులో మెదులుతోంది. మోదీ గత పదేళ్లలో దేశాన్ని అత్యంత పటిష్ఠంగా బలోపేతంగా మారిందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతోందని ఇవాళ ఎవరైనా చెప్పగలరు. మోదీ నిర్భయంగా, ప్రత్యర్థులను చీల్చి చెండాడం, అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ఠను ఆకాశానికి పెంచడం కూడా అందరూ గమనించారు. అందుకే బీజేపీ ఉద్దేశ పూర్వకంగా మోదీ చుట్టూ ప్రచారాన్ని రూపొందించింది. మోదీ వాగ్దానాలు నెరవేరుస్తారని, ఆయన అనర్గళ ప్రసంగాలు ప్రజలను హత్తుకుంటాయని, ఆయనను మించిన వక్త కానీ, నాయకుడు కాని దేశంలో మరెవరూ లేరని ఇవాళ అందరికీ తెలుసు. ఏదైనా మోదీ ముఖానే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ప్రజలకు నచ్చుతున్న విషయం ప్రతిపక్షాలు గమనించడం లేదు. వ్యక్తిగతంగా ఆయన అవినీతిపరుడు కాకపోవడం, ఏదైనా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తాడని ప్రజలు నమ్మడం వల్ల ఇవాళ ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా పోతోంది. నిత్యం కశ్మీర్‌లో చొరబాటుదారులను ప్రేరేపించే పాకిస్తాన్ ఇవాళ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయింది?
గతంలో లాగా సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతి కనపడకపోవడం కూడా మోదీ ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచుతోంది. శౌచాలయాలు, గ్యాస్ కనెక్షన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు ఆర్థిక సహాయం, ముద్రా రుణాలు, ఆరోగ్య బీమా ఇవన్నీ ఆచరణలో ఫలితాలను అందిస్తున్నాయి. అందుకే బీజేపీ ఆత్మవిశ్వాసంతో నేరుగా లబ్ధిదారులను చేరుకోగలుగుతోంది. మైనారిటీలంతా సంఘటితమయ్యారని అందువల్ల బీజేపీ ఓడిపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన కూడా తప్పు. 2019లో కూడా ఇదే వాదన వినిపించినప్పటికీ బీజేపీ అఖండ విజయం సాధించిన విషయం గ్రహించాలి. యూపీలో మైనారిటీలే కనుక బీజేపీని వ్యతిరేకిస్తే మెజారిటీ సీట్లు ఎలా సాధించగలుగుతుంది? అసలు ప్రతిపక్షాలను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్నలు ప్రతిపక్షాలు వేసుకుని ఉంటే వాటి పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడేది. ప్రతిపక్షాల ఆరున్నర దశాబ్దాల పాలనను, మోదీ పది సంవత్సరాల పాలనను ప్రజలు గమనించరని వారు అనుకోవడం పొరపాటు. ప్రతిపక్షాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి ఆశ్రిత పక్షపాతం, పెచ్చరిల్లిన ఉగ్రవాదం, కశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన దారుణాలు, మతకల్లోలాలు, ఆర్థిక సంక్షోభంతో పాటు రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసిన తీరు, ముఖ్యమంత్రులను పదే పదే మార్చిన తీరు ఇవన్నీ ప్రజలు మరిచిపోలేదు. ఇవాళ కులాల పేరుతో, సామాజిక న్యాయం పేరుతో రాహుల్‌గాంధీ చిలుకపలుకులు పలికినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ జమానాలో సామాజిక న్యాయం ఏమైంది? గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కనీస ఆదాయ గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు కాని ఓటర్లలో ఒక్కరు కూడా ఈ హామీని విశ్వసించలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ అంటూ మాట్లాడినంత మాత్రాన ప్రజలు విశ్వసిస్తారా?
మోదీ పట్ల ప్రజలకు బలమైన నమ్మకం ఎందుకు ఏర్పడింది? కాంగ్రెస్ పాలన కంటే మోదీ పాలన అన్ని విధాల మెరుగ్గా ఉండడమే. దేశంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే మోదీ పాలనకు గీటురాయి. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, నక్సలిజం వంటివి తోకముడిచాయి. మైనారిటీ వాదానికి కాలం చెల్లింది. వీటన్నిటికి తోడు బీజేపీ అత్యంత బలోపేతమైన పార్టీగా నలుమూలలా విస్తరించింది. ప్రతిపక్షాల పట్ల జనం విశ్వాసం కోల్పోవడం వల్లనే ఇవాళ బీజేపీ తిరుగులేని పార్టీగా మారింది.
అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ 400 సీట్లు దాటి తీరుతుందని నాలుగో దశ ఎన్నికల తర్వాత మరోసారి ప్రకటించారు. రాహల్‌గాంధీ అమేథీ నుంచి పలాయనం చిత్తగించి, తల్లి నియోజకవర్గమైన రాయబరేలీ నుంచి పోటీ చేయడం, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఎన్‌సీపీ, శివసేన వంటి పార్టీల దయదాక్షిణ్యాలపై ఆధారపడి ఇచ్చిన సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయడం, తృణమూల్ కాంగ్రెస్ తిరస్కరించినా ఆ పార్టీని ఇండియా కూటమిలో కొనసాగించడం ఇవన్నీ కాంగ్రెస్ బలహీనతకు నిదర్శనాలు. కాంగ్రెస్‌కి ఈసారి 50 సీట్లు కూడా రావని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన ఏ మాత్రం వాస్తవదూరం కాదని జూన్ 4న తప్పక నిర్ధారణ అవుతుంది.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)