Loksabha Elections: రుణమాఫీ చేయకుంటే ఆగస్టు సంక్షోభం..!!
ABN , Publish Date - May 15 , 2024 | 03:26 AM
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా
రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
అత్యుత్సాహంతో హామీలు, గ్యారెంటీలు
అమలు చేయకపోతే ప్రజలే కాదు..
సొంత పార్టీ నేతలూ తిరగబడతారు: లక్ష్మణ్
రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు పక్కా: ఈటల రాజేందర్
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా రైతులకు రుణమాఫీ చేయకపోతే రేవంత్ ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. గ్యారెంటీలు, ఉచితాలపై రేవంత్‌రెడ్డి ప్రజల్లో భ్రమలు కల్పించారని.. వాటిని అమలు చేయకపోతే ప్రజలే కాదు.. సొంత పార్టీ నాయకులు కూడా తిరగబడతారని స్పష్టం చేశారు. అప్పు చేస్తేగానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని తెలిసినా.. అత్యుత్సాహంతో హామీలు, గ్యారెంటీలు ఇచ్చారని లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం నాటి పోలింగ్‌ను పరిశీలిస్తే, బీజేపీ అన్ని స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం పక్కా అని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
సర్వే సంస్థలు కూడా ఊహించని విధంగా జూన్ 4న అద్భుతం జరగబోతోందని అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట కాంగ్రెస్ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో.. సీఎం రేవంత్ అవే మాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. పోలింగ్ తర్వాత సీఎం, కాంగ్రెస్ నేతల మాటల్లో మార్పు కనిపించిందన్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ఏలేటి ధీమా వ్యక్తం చేశారు.