Dengue Fever: డెంగ్యూ .. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:13 AM
డెంగ్యూ వైరస్ కారణంగా రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
వాతావరణ మారింది. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దోమ కాటు వల్ల డెంగ్యూ జర్వాలు అధికమవుతున్నాయి. డెంగీ సోకితే ప్లెట్‌లెట్లు తగ్గడం కంటే.. ప్లాస్మా లీకేజీ అధిక ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్మా లీకేజీలు ఎలా గుర్తించాలంటే..
డెంగ్యూ వైరస్ కారణంగా రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్ల హెమరేజిక్ షాక్ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్యం పనికి రాదు..
డెంగ్యూ సోకితే భయపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం కూడా పనికి రాదు. డెంగ్యూకి ఎలాంటి మందులు లేవు. జ్వరం వస్తే పారాసిటమాల్‌తో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పది శాతం మందిలో కొంత ప్లాస్మా లీకేజీల ముప్పు ఉంటుంది. ప్లాస్మా లీకేజీ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ రాజారావు, సీనియర్ వైద్యులు
ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష..
డెంగ్యూ జర్వాల విజృంభించడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ జర్వాలను అరికట్టేందుకు రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు.. ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పుల కారణంగా.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జిల్లా అధికారులు సైతం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. మరోవైపు ఒక్క హైదరాబాద్‌లోని దాదాపు 600లకు పైగా డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు సమాచారం. డెంగ్యూ జ్వర లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు.
డెంగ్యూ జ్వరం లక్షణాలు..
టైగర్ దోమ కుట్టిన 4-5 రోజులకు డెంగ్యూ ఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి.
102 డిగ్రీల జ్వరం, కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దర్లు వస్తాయి.
వైరల్ ఫీవర్ వల్ల కూడా తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి డెంగ్యూ తరహా లక్షణాలు కనిపిస్తాయి.
మూడు రోజుల తర్వాత ఈ లక్షణాలు తగ్గకపోతే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
డెంగ్యూ జ్వర లక్షణాలు కనిపిస్తే.. ఆ వెంటనే ఎన్‌ఎస్1 యాంటిజెన్ వైద్య పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో డెంగ్యూ జ్వర నిర్థారణయితే చికిత్స వెంటనే ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇక డెంగ్యూ జ్వర నిర్ధారణకు ఐజీఎం యాంటీబాడీస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది.
డెంగ్యూని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.
అప్రమత్తంగా ఉంటూ ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకోవాలి.
జ్వరం తగ్గిన అనంతరం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
కొబ్బరి నీళ్లు, మజ్జిగ తదితర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.