Share News

Weekend Sleep: వారాంతాల్లో తనివితీరా నిద్రతో హృద్రోగాల నుంచి రక్షణ లభిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:21 AM

పనిదినాల్లో నిద్రను త్యాగం చేసేవారు వారాంతాల్లో ఆ లోటును పూడ్చుకోవచ్చని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఇలా చేస్తే హృద్రోగాల ముప్పు 20 శాతం తగ్గిపోతుందని పేర్కొంది. అయితే, ఒక గంట పాటు నిద్ర తక్కువైతే కోలుకునేందుకు ఏకంగా నాలుగు రోజులు పడుతుందని కొందరు వైద్యులు అంటున్నారు. దీంతో, వారాంతాల్లో నిద్ర ఉపయోగాలపై నెట్టింట చర్చ మొదలైంది.

Weekend Sleep: వారాంతాల్లో తనివితీరా నిద్రతో హృద్రోగాల నుంచి రక్షణ లభిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో యువత కంటినిండా నిద్రకు దూరమవుతున్నారు. కెరీర్ కోసం ఈ కష్టం తప్పదంటూ సరిపెట్టుకుంటున్నారు. ఈ తీరుతో దీర్ఘకాలికంగా నష్టం తప్పదన్న విషయం తెలిసిందే. అయితే, పనిదినాల్లో నిద్రను త్యాగం చేసేవారు వారాంతాల్లో ఆ లోటును పూడ్చుకోవచ్చని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఇలా చేస్తే హృద్రోగాల ముప్పు 20 శాతం తగ్గిపోతుందని పేర్కొంది. కానీ, ఒక గంట పాటు నిద్ర తక్కువైతే కోలుకునేందుకు ఏకంగా నాలుగు రోజులు పడుతుందని కొందరు వైద్యులు అంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ ప్రకటనల నేపథ్యంలో వారాంతాల్లో నిద్రతో (Health) ఉపయోగాలపై చర్చ మొదలైంది.

Health: పిల్లల్లో డయాబెటిస్.. ఈ అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు!


నిద్రలేమితో సతమతమయ్యే వారు, బిజీ షెడ్యూల్ కారణంగా తగినంత నిద్రపోని వారు వారాంతాల్లో తనివితీరా నిద్రపోతే ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని గుడ్ డీడ్ క్లినిక్ డైరెక్టర్, న్యూరాలజిస్టు డా. చంద్రిల్ చుగ్ తెలిపారు. ‘‘నిద్రలేమితో కలిగే ఇబ్బందులు కొన్ని తొలగిపోవచ్చు. దీనిపై మరింత అధ్యయనం జరగాలి. కానీ, వారాంతాల్లో నిద్రతో పాటు అనేక ఇతర అంశాలు హృద్రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయి’’ అని ఆయన అన్నారు. హృద్రోగ నిపుణుడు డా. జగదీశ్ హీరేమథ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా నిద్రకు దూరమయ్యే వారు వారాంతాల నిద్రతో ఆ లోటును కొంతమేర పూడ్చుకోవచ్చని అన్నారు (Study says weekend sleep recovery may reduce heart disease risk by 20 percent)


వారాంతాల్లో తనివితీరా నిద్రపోతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌ఫ్లమేషన్ సూచిక అయిన సీఆర్‌ఫీ ప్రొటీన్ స్థాయిలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. ఈ తరహా నిద్రతో హైబీపీ ప్రమాదం కూడా తగ్గుతుందట. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు కూడా నియంత్రణలోకి వచ్చి హృద్రోగావకాశాలు సన్నగిల్లుతాయి.

లోటు నిద్రను వారాంతల్లో భర్తి చేయడంతో ఇతర అనేక లాభాలు ఉన్నాయి. దీంతో, ఇన్సూలీన్ సెన్సిటివిటీ పెరిగి డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవక్రియలు మెరుగుపడి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. గుండె కొట్టుకునే వేగం, రక్తపోటును నియంత్రించే ఆటానమిక్ నర్వస్ సిస్టమ్‌లో సమతౌల్యత పునరుద్ధరణ అవుతుంది. బోలు ఎముకల వ్యాధి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా గుండె విద్యుత్ వ్యవస్థ స్థిరీకరణకు గురై అరిథ్మియాస్‌ (గుండెకొట్టుకునే తీరులో మార్పులు) నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి.. పనిదినాల్లో నిద్రకు దూరమయ్యే వారు ఆ లోటును వారాంతాల్లో నిద్రతో భర్తీ చేసుకోవచ్చన్నది వైద్యులు చెప్పేమాట.

Read Health and Telugu News

Updated Date - Sep 05 , 2024 | 08:32 AM