Share News

Donald Trump: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:32 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన రెండు రోజుల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అధికారికంగా నామినేట్ అయ్యారు.

Donald Trump: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన రెండు రోజుల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అధికారికంగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు మిల్వాకీలో సోమవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ సదస్సులో పార్టీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన చేశారు. పార్టీ నామినేషన్‌ను మాజీ అధ్యక్షుడికి అందజేశారు.

కాగా హత్యాయత్నం అనంతరం మిల్వాకీ కన్వెన్షన్‌కు హాజరైన ట్రంప్‌కు పార్టీ శ్రేణులు బ్రహ్మండమైన స్వాగతం పలికాయి. కరతాళ ధ్వనులతో సదస్సు ప్రాంగణాన్ని మోత మోగించాయి. కాగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడడంలో ట్రంప్‌కు ఎవరూ గట్టిగా పోటీ ఇవ్వలేకపోయారు. నిక్కీ హేలీ పోటీ ఇస్తారని భావించినప్పటికీ ఆమె కూడా వెనుకబడ్డారు. వివేక్ రామస్వామి ఆరంభంలోనే వెనక్కి తగ్గారు. దీంతో ట్రంప్ దూసుకెళ్లారు. మెజారిటీ రాష్ట్రాల్లో పార్టీ అంతర్గత ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. చివరకు పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ గెలుచుకున్నారు.


వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా విధేయుడు

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ గెలుచుకున్న డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒకప్పుడు తనను దారుణాతి దారుణంగా విమర్శించి, ఇప్పుడు అత్యంత విధేయుడిగా మారిన ఓహియో సెనేటర్ జేడీ వాన్స్‌ ఎంచుకున్నారు. ఈ మేరకు ‘ట్రూత్ సోషల్‌’ వేదికగా ట్రంప్ ప్రకటించారు. వాన్స్ వయసు కేవలం 39 సంవత్సరాలే కావడం విశేషం. తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టసభ కాంగ్రెస్‌లో ట్రంప్‌కు వాన్స్ అత్యంత విశ్వసనీయంగా పనిచేశారు. చక్కటి సహకారం, మద్దతు అందించారు. అందుకు బహుమతిగా ట్రంప్ ఇప్పుడు ఏకంగా వైస్ ప్రెసిడెంట్ రేసులోకి తీసుకొచ్చారు.


‘‘వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ మన రాజ్యాంగం రక్షణ కోసం పోరాడుతూనే ఉంటాడు. మన దళాలకు అండగా నిలబడతాడు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చేందుకు నాకు సహాయం చేసేందుకు అతడు చేయగలిగినదంతా చేస్తాడు’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 16 , 2024 | 07:34 AM