Pager Explosives: ఒక్కో పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థాలు.. ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ పక్కా ప్రణాళిక!
ABN , Publish Date - Sep 18 , 2024 | 11:05 AM
హిజ్బుల్లాను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొన్ని నెలల ముందే ఒక్కో పేజర్‌కు 3 గ్రాముల పేలుడు పదార్థాలను ‘మొస్సాద్’ అమర్చినట్టు తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన ‘గోల్డ్ అపోలో’ అనే కంపెనీ నుంచి 5,000 పేజర్లను ఆర్డర్ ఇచ్చామని, వీటిలో తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను అమర్చారని లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సీనియర్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
లెబనాన్, సిరియాలో మంగళవారం హిజ్బుల్లా మిలిటెంట్ల వద్దనున్న పేజర్లు(pagers) ఒకసారిగా పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లతో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా, దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పేజర్లు అకస్మాత్తుగా పేలడం ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకోవడానికి, ట్యాపింగ్ బారిన పడకుండా హిజ్బుల్లా ప్రతినిధులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ పక్కా ప్రణాళికతో పేజర్లను పేల్చివేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
హిజ్బుల్లాను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొన్ని నెలల ముందే ఒక్కో పేజర్‌కు 3 గ్రాముల పేలుడు పదార్థాలను ‘మొస్సాద్’ అమర్చినట్టు తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన ‘గోల్డ్ అపోలో’ అనే కంపెనీ నుంచి 5,000 పేజర్లను ఆర్డర్ ఇచ్చామని, వీటిలో తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను అమర్చారని లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సీనియర్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇంతటి భద్రతా ఉల్లంఘన గతంలో ఎప్పుడూ జరగలేదని ప్రతినిధులు అంటున్నారు. పేజర్లు పేలిన ఘటనలో బీరూట్‌లోని ఇరాన్ రాయబారి కూడా ఉండడం గమనార్హం. ఈ పేలుళ్లపై హిజ్బుల్లా ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలావుండగా పేజర్ల పేల్చివేతకు కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.గోల్డ్ అపోలో తయారు చేసిన 5,000 పేజర్లలను హిజ్బుల్లా ఆర్డర్ చేసిందని, ఈ ఏడాది ఆరంభంలో వీటిని తీసుకువచ్చినట్లు లెబానాన్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హ్సు చింగ్-కువాంగ్ మాట్లాడుతూ.. పేలుడుకు ఉపయోగించిన పేజర్‌లను యూరప్‌లోని ఒక కంపెనీ తయారు చేసిందని, తైపీ ఆధారిత సంస్థ బ్రాండ్‌ను ఉపయోగించుకునే హక్కు ఆ కంపెనీకి ఉందని అన్నారు. ‘‘ఉత్పత్తి మాది కాదు. బ్రాండ్ కూడా మాదే ఉంటుంది’’ అని అని మీడియా సమావేశంలో వెల్లడించారు.
అసలు పేజర్ అంటే ఏంటి?
నిజానికి పేజర్ అనేది చిన్న పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. దీనిని సంక్షిప్త సందేశాలు లేదా హెచ్చరికలను పంపడం, స్వీకరించడం కోసం ఉపయోగిస్తారు. ఈ పరికరం రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి సందేశాలను అందుకుంటుంది. వీటిలో కూడా అనేక రకాల పేజర్లు ఉన్నాయి. ఉదాహరణకు న్యూమరిక్ పేజర్లు కేవలం సంఖ్యలను మాత్రమే చూపుతాయి. సాధారణ కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు.
రెండింటినీ
ఆల్ఫాన్యూమరిక్ పేజర్‌లు టెక్స్ట్, నంబర్‌లు రెండింటినీ ప్రదర్శించగలవు. తద్వారా సందేశాలు మరింత వివరంగా పంపిస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పేజర్లను ఉపయోగిస్తున్నారు. పేజర్లను లిథియం బ్యాటరీలతో రూపొందిస్తారు. లిథియం బ్యాటరీలు వేడెక్కగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేడికి లిథియం బ్యాటరీ కరిగి పేలిపోయి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
వాడకం ఎక్కడ
పేజర్లను ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవల కోసం కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేజర్లను గూఢచార సందేశాలను పంపడానికి కూడా వినియోగిస్తారు. లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఈ పేలుళ్లు భద్రతా చర్య ఫలితంగా ఉండవచ్చని హిజ్బుల్లా అధికారి చెప్పారు. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని కూడా ఆరోపించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ పేలుడుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. హిజ్బుల్లా ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఈ పేలుడు ఎవరు చేశారు. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా, ఇజ్రాయెల్ దీన్ని చేసి ఉంటే హిజ్బుల్లాలో భయాన్ని సృష్టించడానికే ఇదంతా చేసిందా అనేది తేలాల్సి ఉంది.