India Maldives Row: భారతీయులారా.. మమ్మల్ని క్షమించండి
ABN , Publish Date - Mar 09 , 2024 | 05:25 PM
భారత్, మాల్దీవుల (India Maldives Row) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) భారతీయులకు క్షమాపణలు చెప్పారు. భారత్ పట్ల తమ మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు.
భారత్, మాల్దీవుల (India Maldives Row) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) భారతీయులకు క్షమాపణలు చెప్పారు. భారత్ పట్ల తమ మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న తాను.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. దౌత్య వివాదం తర్వాత మాల్దీవుల్ని భారతీయులు బాయ్‌కాట్ (Boycott Maldives) చేయడం, ఈ దెబ్బకు అక్కడి టూరిజం (Maldives Tourism) బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మునుపటిలాగే మాల్దీవుల్లో పర్యటించాలని భారతీయుల్ని కోరారు.
‘‘మాల్దీవుల ప్రభుత్వం తీరుతో ఇరుదేశాల మధ్య నెలకొన్న దౌత్యవివాదం.. మాల్దీవులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయం నన్ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు నేను మాల్దీవుల ప్రజల తరఫున క్షమానణలు చెప్తున్నాను. ప్రస్తుతం నేను భారతదేశంలోనే ఉన్నాను. భారతీయ ప్రజలు మాల్దీవులకు రావాలని మేము కోరుకుంటున్నాం. సెలవుల దినాల్లో మాల్దీవులకి రండి, మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని మహమ్మద్ నషీద్ పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత సైన్య తిరిగి వెళ్లిపోవాలని చెప్పినప్పుడు.. భారత్ బాధ్యతాయుతమైన విధానాన్ని అనుసరించిందని కొనియాడారు. భారత్ ఒక బలమైన దేశం అయినప్పటికీ.. మాల్దీవులపై తన బలం ప్రదర్శించకుండా, చర్చల ద్వారా సమస్యని పరిష్కరిద్దామని బదులిచ్చిందని అన్నారు.
ఇదే సమయంలో.. ఇటీవల మాల్దీవులు, చైనా (Maldives China Military Deal) మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై కూడా మహమ్మద్ నషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది రక్షణ ఒప్పందం కాదని, పరికరాల కొనుగోలు అని కడిగిపారేశారు. ముయిజ్జు రబ్బరు బుల్లెట్లతో పాటు టియర్ గ్యాస్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారని.. కానీ అవి అవసరమని మాల్దీవుల ప్రభుత్వం భావించడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ గొట్టాల ద్వారా శాంతియుతమైన పాలన సాగదని సూచించారు. కాగా.. దౌత్యవివాదం తర్వాత మాల్దీవులకు భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ విషయంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. మాల్దీవులకు భారతీయులు రావాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి