Share News

మీ అమ్మాయికి పెళ్లి చేసి భక్తురాళ్లకు సన్యాసం బోధా?

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:34 AM

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఒకపక్క తన కుమార్తెకు చక్కగా పెళ్లిచేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది.

మీ అమ్మాయికి పెళ్లి చేసి భక్తురాళ్లకు సన్యాసం బోధా?

  • జగ్గీ వాసుదేవ్‌కు మద్రాస్‌ హైకోర్టు చురక

చెన్నై, అక్టోబరు 1: సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఒకపక్క తన కుమార్తెకు చక్కగా పెళ్లిచేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. బాగా చదువుకున్న తన ఇద్దరు కూతుళ్లను ఈష ఫౌండేషన్‌ మాయలో పడేసి ఆశ్రమానికి శాశ్వత బందీలుగా మార్చిందని, వారిద్దరిని తనకు అప్పగించాలని ఒక తండ్రి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన ఎస్‌.కామరాజ్‌(69) తన ఇద్దరు కుమార్తెల(42, 39)ను ఈష ఫౌండేషన్‌ నుంచి విడిపించాలని మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టుకు హాజరైన ఇద్దరు కుమార్తెలు తాము ఇష్ట పూర్తిగానే సన్యాసినుల జీవితాన్ని ఎంచుకున్నామని చెప్పారు. వారిని పలు ప్రశ్నలు అడిగిన న్యాయ మూర్తులు ఈ అంశంపై మరింత దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. ఆచార్యుడి కుమార్తెలు ఏదో చెప్పబోగా, ‘‘ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భావిస్తున్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం పాపంగా కనబడటం లేదా? ఽఅని ధర్మాసనం నిలదీసింది. ఈషా ఫౌండేషన్‌పై కేసుల ప్రస్తుత పరిస్థితి మీద నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.

Updated Date - Oct 02 , 2024 | 03:34 AM