Chennai: గూడలూరులో అడవి ఏనుగుల సంచారం..
ABN , Publish Date - Jul 06 , 2024 | 11:07 AM
నీలగిరి జిల్లాలోని గూడలూరు(Gudalur) అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీంతో ఈ ఏనుగుల సంచారాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
- డ్రోన్ల ద్వారా నిఘా
చెన్నై: నీలగిరి జిల్లాలోని గూడలూరు(Gudalur) అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. దీంతో ఈ ఏనుగుల సంచారాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దట్టమైన అడవులున్న ప్రాంతాలైన గూడలూరు, బందలూరులో రోజు రోజుకూ అడవి ఏనుగుల సంచారం అధికమవుతోంది. ఆహారం, నీటి కోసం అడవుల్లో నుంచి గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి ఏనుగులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఊరు సద్దుమణిగిన తర్వాత రాత్రి వేళల్లో మాత్రమే గ్రామాల్లోకి వచ్చి వెళ్ళే ఏనుగులు ప్రస్తుతం ఉదయం సాయంత్రం కూడా సంచరిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే, గజరాజుల దాడులకు గురికాకుండా, తమ ప్రాణాలు కాపాడాలనే డిమాండ్‌తో నీలగిరి జిల్లాల్లోని అటవీ, గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేశారు. అడవులు నుంచి ఏనుగుల మందలు జనావాస ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామసభల్లో కూడా ప్రజలు అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఇదికూడా చదవండి: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనుసూద్ సందడి..
దీనిపై స్పందించిన అటవీశాఖ గ్రామాల్లోకి వచ్చి వెళ్తున్న అటవీ ఏనుగులను పర్యవేక్షించి, వాటిని మళ్ళీ అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళగొట్టేందుకు ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏనుగుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టింది. దీని వల్ల నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూముల్లోకి చొరబడటాన్ని సులభంగా గుర్తించి, ఏనుగులను తరిమివేసే ఏర్పాట్లను అటవీ శాఖ చేపట్టింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ గూడలూరు ప్రాంతంలోని దేవర్‌షోళై అడవుల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించగా, ఐదు ఏనుగులు గ్రామాల్లోకి వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు, గూడలూరు ఫారెస్ట్ రేజంర్ వెంకటేష్ ప్రభు నేతృత్వంలోని అటవీ శాఖ అధికారుల బృందం ఆ ఏనుగులు అటవీ భూముల్లోకి రాకుండా అడ్డుకున్నారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News