Share News

Viral News: పని భారం తట్టుకోలేక ఉద్యోగి మృతి.. అంత్యక్రియలకూ ఎవరు రాలేదు

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:08 PM

పని భారం ఓ యువ మహిళా ఉద్యోగి ప్రాణాలు తీసింది. పుణెలోని బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young)లో పనిచేసే 26 ఏళ్ల ఉద్యోగి అధిక పనిభారం కారణంగా మృతి చెందినట్లు ఆమె తల్లి అనితా అగస్టిన్ ఆరోపించారు.

Viral News: పని భారం తట్టుకోలేక ఉద్యోగి మృతి.. అంత్యక్రియలకూ ఎవరు రాలేదు

పుణె: పని భారం ఓ యువ మహిళా ఉద్యోగి ప్రాణాలు తీసింది. పుణెలోని బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young)లో పనిచేసే 26 ఏళ్ల ఉద్యోగి అధిక పనిభారం కారణంగా మృతి చెందినట్లు ఆమె తల్లి అనితా అగస్టిన్ ఆరోపించారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యానికి ఆమె ఓ లేఖ రాశారు. కుమార్తె అన్నా సెబాస్టియన్ పెరయిల్ ఆఫీస్ కు సంబంధించిన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా చనిపోయారని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకు ఈ - మెయిల్ లో ఆ లేఖను ఫార్వర్డ్ చేశారు.

కేరళకు చెందిన అన్నా 2024 మార్చి 19న అంతర్జాతీయ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ పుణె శాఖలో ట్రైనీ చార్టర్డ్ అకౌంటెంట్గా మార్చి నెలలో చేరారు. ఇది తన కుమార్తెకు మొదటి ఉద్యోగం అని, ఉద్యోగం రావడంపై హర్షం వ్యక్తం చేసినట్లు తల్లి చెప్పారు. ‘‘నా కుమార్తె ఉద్యోగం రావడంతో తొలినాళ్లలో సంతోషంగా ఉంది. అయితే కేవలం నాలుగు నెలల్లోనే ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి లోనైంది. రాత్రి అర్ధరాత్రి వరకూ పని చేసేది. సెలవులు కూడా అరుదుగా ఇచ్చే వారు. వీకెండ్లో కూడా పని ఉండేది. చాలా రోజులపాటు పూర్తిగా అలసిపోయి తన వసతి గృహానికి తిరిగి వచ్చేది. కొత్త ప్లేస్ లో అడ్జస్ట్ అయ్యే సమయం కూడా కంపెనీ ఇవ్వలేదు’’ అని ఆమె తల్లి ఆరోపించారు.


అంత్యక్రియలకు రాలేదు..

ఒత్తిడి తట్టుకోలేక తన బిడ్డ మరణించిందని.. ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి చెప్పినట్లు తల్లి చెప్పారు. వారికి సమాచారం ఇచ్చినా కనీస స్పందన రాలేదని అన్నా సెబాస్టియన్ తల్లి ఆరోపించారు. అంత్యక్రియలకు కూడా ఎవరూ హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘అన్నా.. చదువులో టాపర్. ఇతర పనుల్లోనూ చాలా యాక్టీవ్ గా ఉండేది. సీఏ పరీక్షల్లో డిస్టింక్షన్ తో ఉత్తీర్ణత సాధించింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో నిర్విరామంగా పనిచేసింది. పని పెండింగ్ పెట్టేది కాదు. పని ఒత్తిడి, కొత్త వాతావరణం, ఎక్కువ గంటల పాటు అవిశ్రాంతంగా పని చేయడం ఆమెను శారీరకంగా, మానసికంగా దెబ్బతీశాయి. నా బిడ్డకు ఒక రిపోర్టింగ్ మేనేజర్ ఉన్నాడు. అతను షిఫ్ట్ ముగింపు సమయంలో అన్నాకు అదనపు పనిని ఇచ్చేవాడు. దాంతో ఆమె ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సి వచ్చేది. ఆమె మేనేజర్ తరచూ మీటింగ్ లను రీషెడ్యూల్ చేసేవాడు. దీంతో నా కూతురు తీవ్ర ఒత్తిడికి గురైంది’’ అని అన్నా సెబాస్టియన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.


లేఖపై స్పందించిన కంపెనీ..

తల్లి రాసిన లేఖపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ స్పందించింది. "అన్నా సెబాస్టియన్ అకాల మరణంపై మేం చింతిస్తున్నాం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని లేఖకు రిప్లై ఇచ్చింది.

కేంద్రం ఏమందంటే..

అన్నా సెబాస్టియన్ (26) మృతిపై కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం తెలిపారు. ‘‘అన్నా సెబాస్టియన్ మరణం నన్ను కలచివేసింది. అసురక్షితమైన, దోపిడీతో కూడిన పనివాతావరణం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. న్యాయం జరిగేలా చూస్తాం. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్నాం’’ అని కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు. పని భారం పెరుగుతూ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేలా ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలను ఆదేశించాలని నిపుణులు కోరుతున్నారు.

ForLatest News and National Newsclick here

Updated Date - Sep 19 , 2024 | 04:36 PM