Share News

Delhi : లా సిలబ్‌సలో మనుస్మృతి.. విమర్శలతో వెనక్కి!

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:01 AM

లా డిగ్రీ సిలబ్‌సలో మనుస్మృతిని ప్రవేశపెట్టటానికి రంగం సిద్ధం చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది.

Delhi : లా సిలబ్‌సలో మనుస్మృతి.. విమర్శలతో వెనక్కి!

  • ప్రతిపాదనను తిరస్కరించామని ఢిల్లీ వర్సిటీ వీసీ వివరణ

న్యూఢిల్లీ, జూలై 11: లా డిగ్రీ సిలబ్‌సలో మనుస్మృతిని ప్రవేశపెట్టటానికి రంగం సిద్ధం చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది. సవరించిన సిలబ్‌సలో మనుస్మృతిని చేర్చాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్లు గురువారం డీయూ వైస్‌ చాన్సలర్‌ యోగేశ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి సవరించిన సిలబస్‌ పత్రంలో మనుస్మృతిని చేర్చాలనే ప్రతిపాదనపై డీయూ ఎకడమిక్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. కౌన్సిల్‌ ఆమోదిస్తే.. రానున్న విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ స్థాయి లా సిలబ్‌సలో మనుస్మృతి కూడా ఒక భాగమయ్యేదే. పైగా.. విద్యార్థులు భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలన్న నూతన విద్యావిధానం-2020 మార్గదర్శకాల ప్రకారమే సిలబ్‌సలో అనుబంధ అంశంగా మనుస్మృతిని చేర్చాలని నిర్ణయించినట్లు డీయూ లా విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ అంజువాలి టిక్కూ పేర్కొన్నారు.

కాగా, డీయూకి చెందిన అధ్యాపక సంఘం ‘సోషల్‌ డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫ్రంట్‌’ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ జనాభాలో 85 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల, జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళల పట్ల తీవ్ర వివక్ష చూపి, వారి ప్రాథమిక హక్కులను నిరాకరించే మనుస్మృతిని సిలబ్‌సలో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నిస్తూ డీయూ వీసీకి లేఖ రాసింది. ఫలితంగా ఆ ‘ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా’ వీసీ నుంచి ప్రకటన విడుదలైంది.

Updated Date - Jul 12 , 2024 | 04:01 AM