Delhi : ఓబీసీ ఉపకులాల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:40 AM
షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఏడాది క్రితమే జస్టిస్ రోహిణీ కమిషన్ నివేదిక
ఇంతవరకు బయటపెట్టని ఎన్డీయే సర్కారు
ఉప కులాల్లో గందరగోళం రేగితే ఎన్నికలలో దెబ్బతింటామన్న భయంతో వెనుకడుగు!
సుప్రీం ‘వర్గీకరణ’ తీర్పుతో తెరపైకి ‘ఓబీసీ’
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఓబీసీల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు 2017లో ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి ముర్ముకు గత ఏడాది జూలైలోనే సమర్పించింది. కానీ ఇంతవరకూ ఆ నివేదిక వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. దాన్ని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై జస్టిస్ రోహిణితో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆ నివేదిక సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు కూడా చేరలేదని అధికార వర్గాలు తెలిపాయి.
ఎన్నికల్లో ఇండియా కూటమి కులాలవారీగా జనగణన, రిజర్వేషన్ల అంశం తెరమీదకు తేవడంతో రోహిణీ కమిషన్ నివేదికను బయటపెడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఎన్డీఏ ప్రభుత్వం భావించిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడైనా వెల్లడిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశమవుతోంది. కానీ, ప్రభుత్వ ప్రతిస్పందన మాత్రం తెలియడం లేదు.
ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని, అప్పడే అందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజానికి ప్రభుత్వం రోహిణీ కమిషన్‌ను నియమించిన తర్వాత 13సార్లు పదవీకాలం పొడిగించింది. కాగా, కమిషన్ తన నివేదికను రూపొందించేటప్పుడు పలు అధ్యయనాలు చేసింది.
దాదాపు 5 వేల ఓబీసీ కులాల్లో ఒక శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లను పొందారని, 40 కులాలకే ప్రయోజనాలు దక్కాయని కమిషన్ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై కమిషన్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. ఓబీసీలకు కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్ ఇతర ఉపకులాలకు కూడా సమానంగా పంచాలని కమిషన్ అభిప్రాయపడినట్లు తేలింది.
ఈ నివేదిక బయటపడితే ఓబీసీ ఉపకులాల్లో గందరగోళం చెలరేగుతుందని, కులాల మధ్య చిచ్చు రేగుతుందని, ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం భావించిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
మణిపూర్‌లో రెండు తెగల మధ్య చిచ్చు రేగడం, ఈ ఏడాది ఆఖరిలోపు మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ నివేదిక ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనపడడం లేదు. అయితే ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఓబీసీల అంశం కూడా తెర ముందుకు రానున్నది.