MLA Saritha: బీజేపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం.. వందే భారత్ రైలు ప్రారంభిస్తుండగా..
ABN , Publish Date - Sep 17 , 2024 | 12:58 PM
ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టం ఇటావాలో వందే భారత్ రైలు ప్రారంభించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సరితా బదౌరియాకు రైలు ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఆమె పట్టాలపై పడిపోయారు. హుటాహుటిన పోలీసులు ఎమ్మెల్యేను రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ఇటావా: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఇటావా బీజేపీ ఎమ్మెల్యే సరితా బదౌరియాకు రైలు ప్రమాదం తప్పింది. ఆగ్రా-వారణాసి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించే కార్యక్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె రైలు పట్టాలపై పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు హుటాహుటిన ఎమ్మెల్యేను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున మరో ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అహ్మదాబాద్- భుజ్ మధ్య తిరిగే నమో భారత్ రైలు ఆయన ప్రత్యక్షంగా ప్రారంభించగా మిగతా రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఆగ్రా-వారణాసి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించే కార్యక్రమానికి ఇటావా ఎమ్మెల్యే సరితా బదౌరియా ముఖ్య అతిథిగా వెళ్లారు. సాయంత్రం 6గంటల సమయంలో రైలు ఇటావా స్టేషన్‌కు చేరుకుంది. అయితే అది బయలుదేరే సమయంలో జెండా ఊపేందుకు ఎమ్మెల్యే బదౌరియా సిద్ధమయ్యారు.
కార్యక్రమానికి పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో ఎమ్మెల్యే జెండా ఊపే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కొంతమంది వచ్చి 61సంవత్సరాల బదౌరియాపై పడ్డారు. దీంతో ఆమె ఒక్కసారిగా తూలిపోయి ప్లాట్ ఫామ్ పైనుంచి రైలు పట్టాలపై పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఆమెను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టారు. కొంతమంది పోలీసులు రైలు ఆపేందుకు ప్రయత్నించగా.. మరికొంతమంది ఎమ్మెల్యేను కాపాడేందుకు పట్టాలపైకి దూకారు. ఆమెను తిరిగి ప్లాట్ ఫామ్‌పైకి తీసుకువచ్చారు. దీంతో బదౌరియాకు పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు, స్థానికులు వేగంగా స్పందించి రైలును నిలిపివేసి రక్షించడంతో బదౌరియా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఒక్కసారిగా పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు గాయాలు కాకపోవడంతో డిశ్ఛార్జి చేశారు. దీంతో బదౌరియా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?
Delh CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక.. ప్రకటించిన కేజ్రీవాల్
For more National news and Telugu news click here..