Share News

Flipkart: వెబ్‌సైట్లో లారెన్స్ బిష్ణోయ్ టీషర్టులు.. అడ్డంగా బుక్కైన ఫ్లిప్‌కార్ట్ సంస్థ

ABN , Publish Date - Nov 07 , 2024 | 05:54 PM

కొత్త ట్రెండ్ ను సెట్ చేసే ప్రయత్నంలో ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు అత్యుత్సాహం చూపుతున్నాయి. నైతిక విలువలను మరిచి పలు ఉత్పత్తులను సేల్‌లో ఉంచడంతో ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కొటున్నాయి.

Flipkart: వెబ్‌సైట్లో లారెన్స్ బిష్ణోయ్ టీషర్టులు.. అడ్డంగా బుక్కైన ఫ్లిప్‌కార్ట్ సంస్థ
Flipkart

దిగ్గజ ఈ కామర్స్ వెబ్ సైట్లైన ఫ్లిప్‌కార్ట్, అలీ ఎక్స్ ప్రెస్, టీషాపర్లకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ స్టర్ల ముఖ చిత్రాలతో ఉన్న టీషర్టులను తమ వెబ్ సైట్లో విక్రయిస్తున్నట్టుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే వారిపై కేసు నమోదు చేశారు.


గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో పాటు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం ఫోటోలతో కూడిన టీ-షర్టులను ఫ్లిప్‌కార్ట్, అలీఎక్స్‌ప్రెస్, టీషాపర్ , ఎట్సీలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా అనేక హత్య కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. మరొకరు ఉగ్రవాద దాడులను ప్లాన్ చేసి అమలు చేసేటువంటి నేరాలకు పాల్పడ్డాడు. పెద్దలతో పాటు చిన్న పిల్లల సైజుల్లో కూడా వీటిని అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఉత్పత్తులు నేరపూరిత జీవనశైలిని ప్రోత్సహిస్తాయని, యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.


ఇటువంటి చర్యలు సామాజిక విలువలను క్షీణింపజేయడమే కాకుండా తీవ్రమైన నేరాలను సైతం చిన్నదిగా చూపించే ప్రమాదం కలిగి ఉంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గ్లామరైజ్ చేసే ప్రమాదకరమైన మెసేజ్ ను యువతకు పంపుతుంది. వ్యాపారం పేరుతో హింసను హీరోయిజంగా చూపడం.. దాన్ని సాధారణీకరించే ప్రమాదాన్ని కలిగిస్తుంది అని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఈ వెబ్ సైట్ సంస్థలపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు వారు తెలిపారు. ఇందులో 192 (అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టే ఉద్దేశం) 196 (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 353 (ప్రజా దురాచారం) వంటి సెక్షన్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన సంస్థ పొరపాటును సరిదిద్దుకుంటామని వివరణ ఇచ్చింది.

Maharashtra Elections: ఓటేస్తే పెళ్లి చేస్తాం.. బ్యాచిలర్స్‌కు ఎమ్మెల్యే అభ్యర్థి బంపర్ ఆఫర్


Updated Date - Nov 07 , 2024 | 05:55 PM