Share News

Lakshadweep: లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది.. కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పడింది?

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:44 PM

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యటించినప్పటి నుంచి.. అక్కడి అందాల గురించి ప్రతిఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. పర్యాటకంలో తమతో పోటీ పడలేరని..

Lakshadweep: లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది.. కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పడింది?

Lakshadweep History: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యటించినప్పటి నుంచి.. అక్కడి అందాల గురించి ప్రతిఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. పర్యాటకంలో తమతో పోటీ పడలేరని మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక, మన భారతీయులు ఇకపై లక్షద్వీప్‌కే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పర్యాటకంగా మాల్దీవులని బాయ్‌కాట్ చేసి.. అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు కలిగిన లక్షద్వీప్‌లో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. లక్షద్వీప్ చరిత్ర ఏంటి? అది భారత్‌లో ఎలా భాగమైంది? కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పడింది? అనే ఆసక్తికరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. పదండి.. మేటర్‌లోకి వెళ్లిపోదాం!


లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది?

1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు.. 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి, ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ సమయంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఇలా ఇరుదేశాలు స్వాతంత్రం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి. అయితే.. లక్షద్వీప్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే.. భారత్ ఇంకా దానిని క్లెయిమ్ చేయకపోవడం, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో.. లక్షద్వీప్‌ని నియంత్రించాలని ఆగస్టు నెలాఖారులో లియాఖత్ అలీ భావించారు. వెంటనే తమ యుద్ధనౌకను అక్కడికి పంపించారు.

అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్కాట్ రామస్వామి ముదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్‌లను వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని కోరారు. ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకొని, భారతీయ జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు. ఇలా భారత్, పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరాయి. చివరికి.. భారత సైన్యం ముందుగా లక్షద్వీప్‌కు చేరుకుని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాసేపయ్యాక అక్కడికి చేరుకున్న పాకిస్థాన్ యుద్ధ నౌక.. భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి, అక్కడి నుంచి సైలెంట్‌గా వెనక్కు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి లక్షద్వీప్ మన భారతదేశంలో అంతర్భాగం అయ్యింది. ఒకవేళ మన సైన్యం అరగంట ఆలస్యమై ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి.


లక్షద్వీప్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు చేశారు?

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత.. భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి చేరింది. వాటిల్లో లక్షద్వీప్ కూడా ఒకటి. 1956 నవంబర్ 1వ తేదీన లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది. అప్పుడు దీనిని లక్కాదీవ్-మినీకాయ్-అమినిదివి అని పిలిచేవారు. 1973 నవంబర్ 1న దీనిని ‘లక్షద్వీప్’ అనే కొత్త పేరు పెట్టారు. ఇది జనాభా, విస్తీర్ణం పరంగా చాలా చిన్నది. 32.62 చదరపు కి.మీ. వైశాల్యం కలిగిన ఈ భూభాగంలో 68 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఈ కారణంగా.. దీనికి రాష్ట్ర హోదా దక్కలేదు. ఇతర భౌగోళిక కారణాల వల్ల లక్షద్వీప్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా లభించింది. ఇది 36 చిన్న ద్వీపాల సమూహం అయినప్పటికీ.. ప్రజలు 10 ద్వీపాలలో మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడి జనాభాలో 96% మంది ముస్లింలే ఉన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 04:44 PM