Share News

Election Commission: మా ఫిర్యాదులు పట్టవా?

ABN , Publish Date - May 11 , 2024 | 04:31 AM

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్‌ కమిషన్‌ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్‌ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

Election Commission: మా ఫిర్యాదులు పట్టవా?

  • మోదీ, షాలపై చర్యలేవీ?

  • ఈసీకి ‘ఇండియా’ ప్రశ్న

న్యూఢిల్లీ, మే10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్‌ కమిషన్‌ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్‌ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రె్‌సకు చెందిన అభిషేక్‌ మను సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, డెరెక్‌ ఓబ్రెయిన్‌ (తృణమూల్‌), టి.ఆర్‌.బాలు (డీఎంకే), మహువా మాఝి (జేఎంఎం), బినయ్‌ విశ్వం (సీపీఐ), జావేద్‌ ఆలీ (సమాజ్‌వాదీ)లు ఎన్నికల సంఘాన్ని కలిసి ఏడు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సింఘ్వి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘంతో దాదాపు 45 నిమిషాల సేపు సమావేశమయ్యామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలిపై ‘తీవ్రమైన విశ్వాస లోటు’ ఏర్పడిందని, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఆందోళన, ఆవేదన కలుగుతోందని చెప్పారు.


అసత్య ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదులు చేస్తే ఎన్నికల సంఘం వారికి కాకుండా పార్టీ అధ్యక్షులకు నోటీసులు పంపించిందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని తెలిపారు. పోనీ అధ్యక్షులపై ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా తెలియదని చెప్పారు. రాజస్థాన్‌లోని బాన్స్‌వాడలో ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన మోదీపై ఫిర్యాదు చేయగా ఎన్నికల సంఘం మాత్రం బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు నోటీసులు ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌ వివరాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంపైనా ఎన్నికల సంఘం వద్ద ప్రస్తావించినట్టు సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు 11 ఫిర్యాదులు ఇచ్చినా ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదని తెలిపారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, పోలింగ్‌ జరిగిన 48 గంటల్లోగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల సంఖ్యను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏడీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - May 11 , 2024 | 07:12 AM