Share News

INDIA alliance: లోక్‌సభ ఎన్నికలకే పొత్తు పరిమితం: జైరామ్ రమేష్

ABN , Publish Date - Feb 02 , 2024 | 06:57 PM

'ఇండియా' కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఉద్దేశించినది మాత్రమేనని, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. 27 పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమి పూర్తి మనుగడలో ఉందని, కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు.

INDIA alliance: లోక్‌సభ ఎన్నికలకే పొత్తు పరిమితం: జైరామ్ రమేష్

కోల్‌కతా: 'ఇండియా' (I.N.D.IA.) కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఉద్దేశించినది మాత్రమేనని, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) తెలిపారు. 27 పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమి పూర్తి మనుగడలో ఉందని, కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజకీయ కార్యక్రమం కానప్పటికీ పార్టీకి కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు.


పొత్తు మహారాష్ట్రలోనే..

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన యూబీటీ కలిసే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 'ఇండియా' కూటమి పార్టీల మధ్యం ఎలాంటి పొత్తు ఉండదని పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా రామ్‌పుర్‌హట్‌లో శుక్రవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో జైరామ్ రమేష్ తెలిపారు. బీజేపీకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నడూ సహకరించని దేశంలోని ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని పరిరక్షించేందుకు బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల ప్రచార దృష్టితో చేపట్టినది కాదని రాహుల్ గాంధీ మొదట్నించి చెబుతున్నారని, అయితే రాహుల్ యాత్ర కాంగ్రెస్‌కు కొత్త శక్తి, పార్టీ పటిష్టకు దోహదమవుతుందని అన్నారు. రాహుల్ యాత్రను సిద్ధాంతాల మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు. మణిపూర్ నుంచి ప్రారంభించిన యాత్ర పలు రాష్ట్రాల మీదుగా మార్చి 20న మహారాష్ట్రకు చేరుకుని అక్కడే ముగుస్తుందని, సమాజంలోని అన్ని వర్గాల నుంచి న్యాయ్ యాత్రకు భారీ స్పందన వస్తోందని చెప్పారు.

Updated Date - Feb 02 , 2024 | 06:57 PM